రోడ్డుపై పడి ఉన్న వ్యక్తిని బలవంతంగా జాతీయగీతం పాడించారు

ఢిల్లీ అల్లర్లలో ఒక్కో గుండెది ఒక్కో వేదన. మారణహోమంలో కాలిపోయిన సమిధలెన్నో. రాజకీయం రగిలించిన రావణకాష్టంలో ఎన్నో ప్రాణాలు కాలిపోయాయి. చితిమంటల్లో చలికాచుకునే రాబందులకు అవకాశంగా మారాయి ఢిల్లీ అల్లర్లు. ఈ అరాచకంలో పట్టుమని పాతికేళ్లు కూడా లేని ఓ నవయువకుడు బలైపోయాడు. అల్లమూకల రాక్షసత్వానికి నిలువెల్లా గాయాలతో అల్లాడిపోతున్న 23 ఏళ్ల యువకుడిపై తమ దాష్టీకాన్ని చూపించారు కొంతమంది. ఒళ్లంతా గాయాలతో నడిరోడ్డుపై పడి ఉన్న ఈ యువకుడితో జాతీయ గీతం పాడించారు.అదే దేశభక్తి అని విర్రవీగారు నలుగురు రాక్షసులు. 

వారి కబంధహస్తాల నుంచి ప్రాణాలతో బైటపడేందుకు ఆ యువకుడు లేని శక్తిని కూడదీసుకుని జాతీయ గీతం పాడాడు.  పాడుతూ..పాడుతూ ప్రాణాలు విడిచాడు. మృతుడ్ని ఆందోళనలు జరుగుతున్న ఈశాన్య ఢిల్లీ కర్దంపూరిలో ఉండే ఫైజన్(23)గా పోలీసులు గుర్తించారు. గురువారం జరిగిన ఘటనతో ఢిల్లీలో ఇప్పటికే 42మంది చనిపోయినట్లు తేలింది. 

AltNews అనే ఇంగ్లీషు మీడియా ఈ వీడియోను ధ్రువీకరించింది. రోడ్డుపై తీవ్రగాయాలతో పడి ఉన్న యువకుడితో బలవంతంగా జాతీయగీతం పాడించారు. ఈ దృశ్యాన్ని పోలీసులు చూస్తున్నా ప్రేక్షకుల్లా చూస్తుండిపోవటం గమనించాల్సిన విషయం. జాతీయగీతాన్ని ‘మంచిగా పాడు’ లేదంటే ఇప్పుడే ఛస్తావ్..అంటూ హుంకరించారు. అంతటితో ఆగలేదు ఆ రాక్షసుల అరాచకం.. ఆ యువకుడి మొహంపై లాఠీలతో బలంగా నొక్కుతూ కనిపిస్తోంది ఆ వీడియోలో.  

‘ఇనుప రాడ్లతో దారుణంగా కొట్టారు. కాళ్లు రెండు విరిగిపోయాయి. దెబ్బలతో శరీరమంతా నల్లగా కమిలిపోయింది. ముందుగా రోడ్డుపై కొట్టారు. పోలీసులు తర్వాత తీసుకుపోయారట. ఆ సంగతి నాకు తెలీదు. ఎవరో చూసి నాకు చెప్పారు. హాస్పిటల్‌కు వెళ్లాను. అక్కడ కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్ కు వెళ్లాను. నా కొడుకు ఫొటో చూపించడంతో వాళ్లు గుర్తు పట్టి ఇక్కడే ఉన్నాడని చెప్పారు’ అతణ్ని విడిచిపెట్టాలని ప్రాధేయపడ్డాను. అర్ధరాత్రి ఒంటి గంట వరకూ వాళ్లు వదల్లేదు’ అని బాధితుడి తల్లి చెప్పింది. 

 Also Read | ఢిల్లీ అల్లర్లు : DRP కాన్వెంట్ స్కూల్ మొత్తం దగ్ధం..విద్యార్థుల కన్నీళ్లు

ఇంటికి వెళ్లి రెండో రోజు ఇద్దరు వ్యక్తులతో వచ్చి విడుదల చేయమని కోరినప్పటికీ డిటెన్షన్ కారణంగా వాళ్లు విడిచిపెట్టలేదు. రాత్రి 11గంటల సమయంలో దాదాపు చనిపోతాడని తెలుసుకుని తల్లిని పిలిపించారు. ట్రీట్మెంట్ కోసం లోకల్ డాక్టర్ దగ్గరకు తీసుకుపోయారు. 

‘అతని తల్లి ఇక్కడకు తీసుకువచ్చి పోలీసులే నా కొడుకును కొట్టారు. స్టేషన్‌కు కూడా తీసుకెళ్లారు. రెండు రోజులు అక్కడే ఉంచి పంపించేశారని చెప్పింది. అతని బీపీ లెవల్ బాగా డౌన్ అయింది. హాస్పిటల్ కు పంపించాం. తలకు, లోపలి అవయవాలకు బాగా గాయాలయ్యాయి. వీపు కమిలిపోయి రక్తం గడ్డకట్టడంతో నీలం రంగులోకి వచ్చేసింది’ అని లోకల్ డాక్టర్ చెప్పారు. 

పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు 500మందిని అదుపులోకి తీసుకున్నాం. చాలా ప్రాంతాల్లో ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీఏఏ సపోర్టర్లు, వ్యతిరేకుల మధ్య ఆందోళనలు పెరిగిపోతున్నాయి. పోలీసులు లేని ప్రదేశంలో తీవ్రరూపం దాలుస్తున్నాయి. 4రోజుల్లో 13వేల 200ఫోన్ కాల్స్ ద్వారా కంప్లైంట్లు వచ్చాయి. పరిస్థితి సీరియస్‌గా ఉన్న ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు అంటున్నారు.