సింగిల్ లెగ్ తో ఫుట్ బాల్ ఆడుతున్నపిల్లాడు..గోల్ కొట్టేస్తానంటున్నాడు..

  • Publish Date - November 11, 2020 / 03:39 PM IST

సంకల్పం ఉంటే వైకల్యం కూడా పారిపోతుందంటారు పెద్దలు. కానీ సంకల్పం అంటే కూడా ఏమిటో తెలియని పసివయస్సులో తనకు ఓ కాలు లేదనే మాటే మరచిపోయి రెండు కాళ్లు ఉండీ కూడా ఏమీ చేయలేని వారికి సవాలుగా నిలుస్తున్నాడు తొమ్మిదేళ్ల పిల్లాడు.



రెండు కాళ్లు ఉన్న వాళ్లే ఆటల్లో తడబడుతుంటే ఒక్క కాలుతోనే చక్కగా ఆటలు ఆడేస్తు..సైకిల్ తొక్కేస్తూ చూసేవారందరిని ఆశ్చర్యపరుస్తూ ‘నువ్వు పిల్లాడివి కాదురా పిడుగువి’’అనిపించుకుంటున్నాడు మణిపూర్ కు చెందిన 9 ఏళ్ల పిల్లాడు.


పుట్టుకతోనే ఒక కాలు లేకుండా పుట్టిన ఆ పిల్లాడు ఫుట్ బాల్ ఆడేస్తున్నాడు. చక్కగా సైకిల్ తొక్కేస్తాడు. ఎవ్వరి సహాయం లేకుండా స్కూల్ కు వెళ్లేవాడు. అన్నీ ఒక్క కాలుతోనే చేసేస్తున్నాడు. ఆ చిచ్చరపిడుగు పేరు కునాల్ శ్రేష్ట.


మణిపూర్ రాజధాని ఇంపాల్ కు చెందిన కునాల్ శ్రేష్ట నాలుగో తరగతి చదువుతున్నాడు. వయసు తొమ్మిదేండ్లు. పుట్టినప్పుడే ఒక కాలు లేకుండానే పుట్టాడు. కానీ కునాల్ అమ్మానాన్నలు కునాల్ కు ఒకకాలు లేదనీ మాటే గుర్తు రాకుండా పెంచారు.


నువ్వు అందరిలాంటివాడివి కాదు..నువ్వో ప్రత్యేకమైనవాడివి. ప్రత్యేకమైన వ్యక్తులంతా.. ప్రత్యేక లక్షణాలతోనే పుడతారని తల్లి చెబుతుంటుంది. దీంతో కునాల్ తనకు ఓ కాలు లేదనే విషయమే మరచిపోయాడు. నాన్న కూడా అంతే..మా బాబే బంగారం..రెండో కాలులేకపోతే ఏంటీ..సాధించి చూపిస్తాడు నాకొడుకు అని చెబుతూ పెంచుతున్నాడు. ఒకకాలు లేదనే ఊహే రానివ్వకుండా పెంచుతున్నారు.


అలాగే కునాల్ కూడా తల్లిదండ్రుల నమ్మకాన్ని కునాల్ శ్రేష్ట ఏనాడు వమ్ము చేయలేదు. చదువుల్లో ఫస్ట్. ఆటల్లో ఫస్ట్. సైకిల్ తొక్కటంలో కునాలే ఫస్ట్. కానీ కునాల్ కు ఫుట్ బాల్ అంటే చాలా ఇష్టం. రెండు కాళ్లు ఉన్నవాళ్లే ఫుట్ బాల్ ఆడటానికి తడబడుతుంటారు. కానీ కునాల్ మాత్రం చక్కగా ఫుట్ బాల్ ఆడేస్తున్నాడు ఒంటికాలితో. చేతికింద క్రచ్ తో.. అతడు ఫుట్ బాల్ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


‘నాకు ఫుట్ బాల్ ఆటంటే చాలా చాలా ఇష్టం. ఈ ఆట ఆడే కొత్తలో కొంచె ఇబ్బంది పడ్డాను.కానీ ఏదీ ముందుగా రాదుకదా…నేర్చుకుంటేనే వస్తుంది. కానీ..నాకు ఒకకాలే ఉండటంతో నేను ఆడగలనో లేనో అని చాలా భయమైంది. కానీ ఎందుకు ఆడలేను..అనే పట్టుదలతో ఆడటం ప్రారంభించా..ఇప్పుడు నేను చక్కగా ఆడుతున్నారు..నా ఫ్రెండ్స్ అంతా నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. త్వరలోనే నేను గోల్ చేస్తా..’ అంటూ ధీమా వ్యక్తంచేస్తున్నాడు. శెభాష్ కునాల్..నువ్వు సాధిస్తావ్…సాధించి తీరతావ్..