GST Reforms: జీఎస్టీలో భారీ మార్పులు? ప్రజలకు మేలు జరిగేలా సంస్కరణలు.. వీటి ధరలు తగ్గే ఛాన్స్..!

GST Collection
GST Reforms: జీఎస్టీపై ప్రధాని మోదీ ప్రకటన ఇప్పుడు సామాన్యుల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. జీఎస్టీలో సవరణ కోసం ఇప్పటికే హైపవర్ కమిటీ ఏర్పాటు చేసి రివ్యూ నిర్వహిస్తున్నామని, కమిటీ రిపోర్ట్ ఆధారంగా జీఎస్టీలో సంస్కరణలు తీసుకొస్తామన్నారు మోదీ. జీఎస్టీపై రాష్ట్రాలతో చర్చించి మార్పులు చేర్పులు చేస్తున్నామని, జీఎస్టీలో కొత్త తరం సంస్కరణలు ఈ దీపావళి నాటికి వస్తాయని ప్రధాని మోదీ తెలిపారు.
ప్రధాని చెప్పిన సంస్కరణల్లో భాగంగా జీఎస్టీ విధానంలో భారీ మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఈ సెప్టెంబర్ లో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఉండబోతోంది. జీఎస్టీ కౌన్సిల్ త్వరలో 12శాతం ట్యాక్స్ శ్లాబ్ ను తొలగిస్తారని సమాచారం. ప్రస్తుతం 5, 12, 18, 28 శాతం ఉన్న నాలుగు శ్లాబులు.. మూడు శ్లాబులకు తగ్గించే ప్రతిపాదనపై చర్చిస్తారని సమాచారం. అంటే 12శాతం శ్లాబ్ ను తొలగిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే రోజువారీ వస్తువులు, సేవల ధరలపై భారీగా ప్రభావం చూపబోతోంది.
ఇక 12శాతం జీఎస్టీ శ్లాబ్ లో హెల్త్ అండ్ ఇన్సూరెన్స్ పై ట్యాక్స్ కు సంబంధించిన వాటిపై దృష్టి సారించే ఛాన్స్ ఉంది. 12శాతం ట్యాక్స్ శ్లాబ్ లో రోజువారీ జీవితంలో తరుచు ఉపయోగించే ఎన్నో వస్తువులు, సేవలు ఉన్నాయి. పాలు, చీజ్, డ్రై ఫ్రూట్స్, జామ్, ఫ్రూట్ జ్యూస్, డ్రింక్స్, పాస్తా, వాటర్ బాటిల్స్, కాంటాక్ట్ లెన్సెస్, సైకిల్స్, ఫీడింగ్ బాటిల్స్, గొడుగులు, వెయ్యి రూపాయల లోపు ఫుట్ వేర్, కాటన్ హ్యాండ్ బ్యాగ్స్, మార్బుల్, గ్రానైట్, బ్లాక్స్, డయాగ్నోస్టిక్ కిట్స్ వంటివి ఉన్నాయి.
ఇక 7వేల 500 లోపు హోటల్ రూమ్స్, నాన్ అకానమీ క్లాస్ ఎయిర్ ట్రావెల్, కొన్ని కన్ స్ట్రక్షన్ వర్క్స్, ప్రొషెషనల్, టెక్నికల్ సర్వీసెస్, మల్టీ మోడల్ ట్రాన్స్ పోర్టేషన్ వంటి సేవలు కూడా ఈ శ్లాబ్ లో ఉన్నాయి. ఈ వస్తువులు, సేవలు 5శాతం లేదా 18 శాతం శ్లాబ్ కు మారితే కొన్నింటి ధరలు తగ్గుతాయి. మరికొన్ని ధరలు పెరిగే ఛాన్స్ ఉంది. ఈ ధరలు తగ్గడం వల్ల ఎంఎస్ ఎంఈలు ప్రయోజనం పొందుతాయి. ఇక రోజువారీ అవసరాల ఉత్పత్తులు తక్కువ ధరకే లభిస్తాయి. దీంతో ఆర్థిక వ్యవస్థకు కూడా ఊతం లభిస్తుంది.