Manipur Assembly Elections 2022 : ఈశాన్య రాష్ట్రంలో సింగిల్‌గా అధికారం చేపట్టాలని చూస్తున్న కమలనాధులు

మణిపూర్ అసెంబ్లీలో మొత్తం 60 స్థానాలున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 31 స్థానాల మెజార్టీ కావాలి. 40 స్థానాల్లో కమలం జెండాను రెపరెపలాడించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది.

Manipur Assembly Elections 2022

Manipur Assembly Elections 2022  :  దేశంలోని ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ ఎన్నికల నగారా మోగింది. భారత ఎన్నికల సంఘం (ECI) శనివారం గోవా, పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖండ్ మరియు ఉత్తరప్రదేశ్ శాసనసభలకు సాధారణ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ ఏడాది మొత్తం ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనుండగా.. మొత్తం 690 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి (పంజాబ్ 117, గోవా 40, మణిపూర్ 60, ఉత్తర్ ప్రదేశ్ 403, ఉత్తరాఖండ్ 70).

ఈ ఐదు రాష్ట్రాల్లో 18.34 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు వివరించారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర. కరోనా ఉధృతి నేపథ్యంలోనే ఎన్నికలు సజావుగా నిర్వహిస్తామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర తెలిపారు. ఈ రాష్ట్రాల్లో 100 శాతం రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేయాలనీ అధికారులకు ఆదేశాలు జారీచేసినట్లు తెలిపారు.

మణిపూర్
మణిపూర్ అసెంబ్లీలో మొత్తం 60 స్థానాలున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 31 స్థానాల మెజార్టీ కావాలి. 40 స్థానాల్లో కమలం జెండాను రెపరెపలాడించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. 2017  ఎన్నికల్లో 28 స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించినప్పటికీ.. 21 స్ధానాలు గెలుచుకున్న బీజేపీ మూడు ప్రాంతీయ పార్టీలు-నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పిఎఫ్) నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పిపి), లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జెపి)తో పొత్తు పెట్టుకుని ముఖ్యమంత్రిగా నోంగ్‌తోంగ్‌బామ్ బీరెన్ సింగ్‌తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది.

బీరెన్ సింగ్‌ స్వతంత్ర అభ్యర్థి, మరియు మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా. కాగా….గత ఐదేళ్లలో 13 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి మారారు. ముఖ్యమంత్రి నోంగ్‌థోంగ్‌బామ్ బీరెన్ సింగ్, మాజీ కాంగ్రెస్ నాయకుడు, మణిపూర్‌లో పార్టీ లోపల బలమైన లాబీతో ఐదేళ్లుగా కూటమిని నడిపించగలిగారు. మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తీరుపై అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.

Also Read : Uttar Pradesh Elections 2022 : అధికారం కోసం అఖిలేష్… పదవి నిలబెట్టుకునేందుకు యోగి యత్నాలు

ఈ సారి అలాంటి విమర్శలకు తావివ్వకుండా సొంతంగా మెజార్టీ సాధించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రధాన సమస్యగా ఉన్న సైన్యానికి ప్రత్యేక అధికారాల చట్టం..  మణిపూర్‌ రాజకీయాల్లో ఎప్పటినుంచో కీలకపాత్ర పోషిస్తోంది. నాగాలాండ్‌లో ఇటీవల ఆర్మీ.. ఉగ్రవాదులుగా పొరపడి సాధారణ పౌరులను కాల్చిచంపిన ఘటన మణిపూర్ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపనుంది.

మణిపూర్ లో
మొత్తం స్థానాలు – 60
ప్రభుత్వ ఏర్పాటుకు కావల్సిన స్థానాలు- 31
అధికారంలో బీజేపీ కూటమి
బీజేపీ కూటమికి 25 స్థానాలు
కాంగ్రెస్‌కు 17 స్థానాలు