Manipur Police
Manipur horror– Women Video: మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, హింసించిన నిందితుల్లో నలుగురిని పోలీసులు (Manipur Police) అదుపులోకి తీసుకున్నారు. మహిళలను నగ్నంగా ఊరేగించిన రెండు నెలల తర్వాత వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు ఇప్పుడు అరెస్టులు చేస్తున్నారు.
ఇప్పటి వరకు నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు వారిని కోర్టులో ప్రవేశపెట్టారు. నిందితులను 11 రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఆ నలుగురు నిందితులనూ గురువారమే అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. వారిలో ప్రధాన నిందితుడూ ఉన్నాడని వివరించారు.
మరోవైపు, మణిపూర్‌లోని కుకీ తెగకు చెందిన తమపై మూక దాడి చేశారని, పశువుల్లా ఎగబడుతూ తన భార్యను నగ్నంగా ఊరేగించారని ఓ వ్యక్తి చెప్పారు. మే 4న కుకీ తెగవారి కోసం వెతుకుతూ ఆ తెగకు చెందిన ఇద్దరు మహిళలను పట్టుకుని ఓ మూక దాడి చేసిన విషయం తెలిసిందే.
ఆ ఇద్దరు బాధితుల్లోని ఓ మహిళ భర్త తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. తాను మాజీ సైనికుడినని, కార్గిల్ వీరుడిగా భారత్ కోసం పోరాడిన తాను భార్యను మాత్రం రక్షించుకోలేకపోయానని తెలిపారు. కాగా, మహిళలను ఊరేగించిన వారిని ఎన్‌కౌంటర్ చేయాలని ప్రజలు సామాజిక మాధ్యమాల ద్వారా డిమాండ్ చేస్తున్నారు.