మణిపూర్‌లో కర్ఫ్యూ.. ఇంటర్నెట్‌ బంద్‌.. సీఎం బీరేన్‌ సింగ్‌ ఇంటిపై దాడి..

ఇవాళ ఉదయం ముగ్గురు రాష్ట్ర మంత్రులు, ఆరుగురు శాసనసభ్యుల ఇళ్లను నిరసనకారులు ధ్వంసం చేశారు.

మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. కొందరు రాజకీయ నాయకుల ఇళ్లపై ఆందోళనకారులు దాడులు చేయడానికి యత్నిస్తున్నారు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, బీజేపీ నేతల ఇళ్లపై ఇప్పటికే వారు దాడులకు పాల్పడ్డారు. నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ వ్యక్తిగత నివాసంపై కూడా ఆందోళనకారులు దాడులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

భద్రతా బలగాలు, నిరసనకారులకు మధ్య ఘర్షణ తలెత్తింది. మైతేయీ-కుకీ తెగల మధ్య తరుచూ అల్లర్లు చెలరేగుతుండడంతో మణిపూర్‌లో కొన్ని నెలలుగా ప్రతికూల పరిస్థితులు కొనసాగుతున్నాయి. రెండు రోజుల క్రితం ముగ్గురు మైతేయీల మృతదేహాలు జిరి నదిలో కనపడడంతో ఈ నిరసనలు జరుగుతున్నాయి.

తాజాగా మరో ముగ్గురి మృతదేహాలు కనపడడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ఇంఫాల్ లోయలోని పలు జిల్లాల్లో అధికారులు నిరవధిక కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ప్రభుత్వం భారీగా భద్రతా చర్యలను తీసుకుంటోంది.

ఇవాళ ఉదయం ముగ్గురు రాష్ట్ర మంత్రులు, ఆరుగురు శాసనసభ్యుల ఇళ్లను నిరసనకారులు ధ్వంసం చేశారు. లోయ అంతటా హింసాత్మక నిరసనలు కొనసాగుతుండటంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు టియర్ గ్యాస్‌ ప్రయోగిస్తున్నాయి.

Kailash Gehlot Resigns: కేజ్రీవాల్‌కు బిగ్‌షాక్.. ఆమ్ఆద్మీ పార్టీకి మంత్రి కైలాష్ గెహ్లాట్ రాజీనామా