మన్మోహన్ కి ఎస్పీజీ భద్రత ఉపసంహరణ

మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌కు ప్రత్యేక భద్రతా బృందం(SPG) భద్రతను కేంద్రం వెనక్కి తీసుకుంది. ఎస్పీజీ భద్రతపై సమీక్ష చేపట్టిన అనంతరం కేంద్ర హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. CRPF భద్రతను మన్మోహన్ కు కొనసాగించనున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. ఎంపిక చేసిన కొద్దిమందికి మాత్రమే అర్హత ఉన్న ఎస్పీజీ భద్రతను సమీక్షించే వార్షిక ఎక్సర్ సైజ్ లో భాగంగా మన్మోహన్ సింగ్ భద్రత విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఎస్పీజీలో 3 వేలకు పైగా సిబ్బంది ఉన్నారు. బెదిరింపు అవగాహన ఆధారంగా ఈ ప్రత్యేక బృందం ప్రధానమంత్రులతో పాటు మాజీ ప్రధానమంత్రులు మరియు వారి కుటుంబాలను కవర్ చేస్తుంది. ప్రస్తుతం ఎస్పీజీ హోదా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి, కాంగ్రెస్ జాతీయాధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాలకు కొనసాగుతోంది. 

డాక్టర్ మన్మోహన్ సింగ్ కి Z + సెక్యూరిటీ కవర్ కొనసాగుతుందని హోం మంత్రిత్వ శాఖ అధికారి తెలిపారు. ప్రధాని గా ఉన్న 10ఏళ్ల కాలంలో మన్మోహన్ తన భద్రత గురించి ఎప్పుడూ పట్టించుకోలేదని,ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఆయన కట్టుబడి ఉంటారని మన్మోహన్ సన్నిహిత వర్గాలు తెలిపారు. 

20ఏళ్ల క్రితం మాజీ ప్రధానులు హెచ్ డీ దేవెగౌడ,వీపీ సింగ్ లకు కూడా ఇదే విధంగా ఎస్పీజీ సెక్యూరిటీని ఉపసంహరించిన విషయం తెలిసిందే. అయితే అనారోగ్యం కారణంగా కొన్నేళ్ల పాటు ఇంటికే పరిమితమైన  మాజీ ప్రధాని వాజ్ పేయి చనిపోయిన 2018 వరకు ఆయనకు ఎస్పీజీ భద్రత కల్పించారు. 

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య తర్వాత ప్రధానుల భద్రత కోసం 1985లో ఎస్పీజీ వ్యవస్థ ఏర్పాటు అయింది. అయితే 1991లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య తర్వాత మాజీ ప్రధానులు,వారి కుటుంబాలకు  10ఏళ్ల పాటు ఎస్పీజీ భద్రత కల్పించే విధంగా ఎస్పీజీ చట్టానికి సవరణ చేశారు. అయితే 2003 లో మాజీ ప్రధాని వాజ్ పేయి…10ఏళ్ల నుంచి ఒక ఏడాదికి లేదా కేంద్రం నిర్ణయించిన ముప్పు స్థాయిని బట్టి ఇచచేలా ఎస్పీజీ సెక్యూరిటీ కల్పించేలా చట్టానికి మరోసారి సవరణ చేశారు.