Dead Body
Dead Body: ఎవరైనా చనిపోతే బంధువులు, స్నేహితుల చివరి చూపు కోసం వాళ్ళు వచ్చేవరకు మృతదేహాన్ని ఫ్రీజర్ లో ఉంచుతారు. మహా అయితే అలా ఒకటి రెండు రోజులు ఉంచుతారు. ఆసుపత్రుల మార్చురీల్లో అయితే మృతదేహాలను రోజుల తరబడి కూడా భద్రపరుస్తారు. కానీ, ఓ తండ్రి మాత్రం తన కొడుకు డెడ్ బాడీని 22 రోజులుగా ఇంట్లోనే ఫ్రీజర్ లో ఉంచాడు. ఈ వార్త కలకలం రేపడంతో కలెక్టర్, పోలీసులు రంగప్రవేశం చేసి చివరికి ఆ తండ్రిని కొడుకు మృతదేహానికి అంతిమ సంస్కారాల కోసం ఒప్పించారు.
ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పుర్ జిల్లా మజావున్ గ్రామానికి చెందిన శివాంక్(32) 2012 నుంచి ఢిల్లీలోని ఓ కాల్‌సెంటర్‌లో పనిచేస్తుండగా అక్కడే అతడికి గుర్లీన్ కౌర్ అనే యువతి పరిచయం కావడంతో 2013లో వారు వివాహం చేసుకున్నారు. అప్పటి నుండి అంతా సజావుగా సాగుతుండగా ఆగష్టు 1వ తేదీన శివాంగ్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని అతడి తండ్రి శివ్‌ప్రతాప్ పాఠక్‌కు అప్పగించారు.
కుమారుడి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చిన తండ్రి అంత్యక్రియలు మాత్రం నిర్వహించలేదు. కొడుకు మృతిపై అనుమానాలున్నాయని, నిజాలు బయటపడేవరకు అంతిమ సంస్కారాలు నిర్వహించబోనని 22 రోజులుగా మృతదేహాన్ని ఇంట్లోని డీప్ ఫ్రిజ్‌లో భద్రపరిచాడు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ సోమవారం పోలీసు యంత్రాంగంతో చర్చలు జరిపి జిల్లా ప్రధాన మెడికల్ ఆఫీసర్ (CMO) పర్యవేక్షణలో డాక్టర్ల బృందంతో మృతదేహానికి రెండోసారి పోస్టుమార్టం నిర్వహించి అంత్యక్రియలు నిర్వహించేలా ఒప్పించారు. ఇక, ఇప్పుడు రెండోసారి పోస్టుమార్టం నివేదికలు రావాల్సి ఉంది.