బిగ్ డెవలప్ మెంట్ : పుల్వామా దాడి కారు ఓనర్ ని గుర్తించిన NIA

పుల్వామా ఉగ్రదాడి కేసు విచారణలో NIA(నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) అత్యంత వేగంగా పురోగతి సాధించింది. దాడికి ఉపయోగించిన కారు,దాని ఓనర్ ని గుర్తించినట్లు సోమవారం(ఫిబ్రవరి-25,2019) NIA(నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) తెలిపింది.  ఫోరెన్సిక్,ఆటో మొబైల్ నిపుణుల సహకారంతో.. ఛాసిస్ నంబర్ MA3ERLF1S00183735, ఇంజిన్ నంబర్ G12BN164140 కలిగిన మారుతీ ఎకో కారుని దాడికి ఉపయోగించినట్లు దర్యాప్తు అధికారులు కనిపెట్టారు. ఈ కారుని 2001లో అనంత్ నాగ్ లోని హెవెన్ కాలనీకి చెందిన మొహమ్మద్ జలీల్ అహ్మద్ హఖానీ కొనుగోలు చేశాడని,ఏడు సార్లు ఈ కారు చేతులు మారిందని, చివరిగా దక్షిణ కాశ్మీర్ లోని బిజ్ బెహరాకి చెందిన సజ్జద్ భట్ దగ్గరకు ఈ కారు చేరిందని ఎన్ఐఏ ప్రతినిధి తెలిపారు.

ఫిబ్రవరి-4,2019న ఈ కారుని సజ్జద్ భట్ ఈ కారుని కొనుగోలు చేశాడని, సజ్జద్ షోపియాన్ లోని సిరాజ్ ఉల్ ఉలూమ్ కాలేజీ విద్యార్థి అని తెలిపారు. శనివారం సజ్జద్ నివాసంలో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారని, సజ్జద్ పరారీలో ఉన్నట్లు ఆయన తెలిపారు. పుల్వామా దాడికి పాల్పడిన ఉగ్రసంస్థ జైషే మహమ్మద్ లో సజ్జద్ చేరినట్లు అధికారులు గుర్తించారు. సోషల్ మీడియాలో ఆయుధాలను పట్టుకొని ఉన్న సజ్జద్ ఫొటోని అధికారులు గుర్తించారు. ఫిబ్రవరి-14,2019న పుల్వామా జిల్లాలో సీఆర్పీఎప్ కాన్వాయ్ పై జైషే మహమ్మద్ కి చెందిన సూసైడ్ బాంబర్ అదిల్ అహ్మద్ దార్ జరిపిన దాడిలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.