Vehicle Sales
Vehicle Sales : కరోనా వేళ వాహన అమ్మకాలు భారీగా పడిపోయాయి. సుమారు 14 నెలల పాటు దేశ వ్యాప్తంగా వివిధ ఆంక్షలు ఉండటంతో విక్రయాలు భారీగా తగ్గాయి. ఇక జూన్ నెలలో సడలింపు ఇవ్వడంతో విక్రయాలు భారీగా పెరిగాయి. జూన్ నెలలో అన్ని వాహన శ్రేణులలో కలిపి 12,17,151 యూనిట్లు అమ్ముడైనట్లు ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ తెలిపింది.
దేశ వ్యాప్తంగా ఉన్న 1295 మంది పంపిణీదారుల (డీలర్ల) డేటా ఆధారంగా ఈ వివరాలు వెల్లడించారు. గతేడాది జూన్ లో 9,92,610 యూనిట్ల వాహనాలు అమ్మగా ఈ ఏడాది 22.62 శాతం వృద్ధి సాధించింది 12,17,151 యూనిట్లను విక్రయించామని తెలిపారు.
కార్లు, టాక్సీలు గత ఏడాది జూన్ నెలలో 1,28,360 యూనిట్లు అమ్ముడయ్యాయి.. 2021 జూన్ లో అమ్మకాలు 43.45 శాతం పెరిగి 1,84,134 యూనిట్లకు చేరుకున్నాయి. వాణిజ్య వాహనాల అమ్మకం గణనీయంగా పెరిగింది. గతేడాది జూన్ నెలలో 10,619 యూనిట్లు అమ్మగా ఈ ఏడాది జూన్ నెలలో 35,700 యూనిట్లు విక్రయం జరిగింది. అంటే ఇది 236.19 శాతం అమ్మకాలు పెరిగాయన్నమాట.
ద్విచక్ర వాహనాల అమ్మకం కూడా భారీగా పెరిగింది. జూన్ నెలలో 9,30,324 యూనిట్లను విక్రయించారు. 2020 జూన్ లో 7,95,819 యూనిట్లను మాత్రమే విక్రయించారు. గతేడాది జూన్ తో పోల్చితే ఈ ఏడాది జూన్ లో 16.90 శాతం ఎక్కువ అమ్మకాలు జరిగాయి.
ఈ ఏడాది మే, జూన్ నెలల్లో ట్రాక్టర్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. మే నెలలో 45,735 ట్రాక్టర్లను విక్రయించగా, జూన్ నెలలో 52,261 ట్రాక్టర్లను విక్రయించారు. మే నెలతో పోల్చుకుంటే జూన్ నెలల్లో 14.27 శాతం అమ్మకాలు పెరిగాయి.
అయితే డిమాండ్ కి తగినట్లుగా సరఫరా చేయలేకపోతున్నామని కంపెనీలు చెబుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా సెమికండక్టర్ల కొరత అధికంగా ఉందని. దీంతో వాహనాల తయారీ తగ్గిందని చెబుతున్నారు. సెమికండక్టర్లు అందుబాటులోకి వస్తే వాహనాల ఉత్పత్తి పుంజుకుంటుందని చెబుతున్నారు.