Mathew Samuel
Mathew Samuel On Narada Case Arrests 2014లో తాను నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ ఆధారంగా కొందరు బెంగాల్ రాజకీయ నాయకులు అరెస్టు కావడంపై నారద న్యూస్ వ్యవస్థాపకుడు, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు మాథ్యూ సామ్యూల్ హర్షం వ్యక్తం చేశారు. నారదా టేపుల వ్యవహారంలో సీబీఐ సోమవారం ఉదయం ఇద్దరు టీఎంసీ మంత్రులు,ఓ ఎమ్మెల్యే,ఓ మాజీ మంత్రిని అరెస్టు చేయడం..సాయంత్రం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం వీరికి బెయిల్ మంజూరు చేయడం తెలిసిందే.
అయితే ఈ కేసులో ఇంకా పెద్ద తలకాయలు చాలా ఉన్నాయని, నేడు జరిగిన అరెస్టులు సముద్రంలో ఒక్క బొట్టు మాత్రమేనని మాథ్యూ సామ్యూల్ తెలిపారు. కానీ ఇదే కేసులో తృణమూల్ నుంచి ఇటీవల బీజేపీలోకి మారిన సువేందు అధికారిని అరెస్టు చేయకపోవడం ఏమిటని మాథ్యూ ప్రశ్నించారు. 2016 లో స్టింగ్ ఆపరేషన్ టేప్స్ విడుదల అయ్యాయి. కానీ పొలిటిషియన్లను సీబీఐ టచ్ చేయలేదు.. మూడేళ్ళ క్రితమే వీరిపై ఛార్జి షీట్ దాఖలయింది అని శామ్యూల్ పేర్కొన్నారు.
2016 లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముడుపులు తీసుకున్న తృణమూల్ నాయకులు పలువురి ఫోటోలను, వీడియో రికార్డింగులతో సహా నారదా న్యూస్ ప్రచురించింది. వీటినే నారదా టేప్స్ గా వ్యవహరించారు. సువెందు అధికారితో బాటు ముకుల్ రాయ్ వంటి నేతల ప్రమేయం కూడా ఈ వ్యవహారంలో ఉంది. నాడు తానే స్వయంగా సువెందు అధికారి కార్యాలయానికి వెళ్లి డబ్బులు ఇఛ్చి వచ్చానని శామ్యూల్ తెలిపారు. ఫారెన్సిక్ పరీక్షల్లోనూ సువేందు డబ్బు తీసుకున్నట్టు రుజువైందని తెలిపారు. సీబీఐ తన స్టేట్‌మెంట్ కూడా తీసుకుందని మాథ్యూ సామ్యూల్ తెలిపారు. కానీ ఏం జరిగిందో తెలియదు సువెందు పేరు అరెస్టుల జాబితాలో లేదని మాథ్యూ అన్నారు.