Medical Shops : బిగ్ అలర్ట్.. ఈనెల 20న మెడికల్ షాపులు బంద్.. కారణాలివే..
Medical Shops : దేశవ్యాప్తంగా ఈనెల 20వ తేదీన మెడికల్ షాపులు బంద్ కానున్నాయి. అఖిల భారత కెమిస్టులు, డ్రగ్గిస్టుల సంఘం (ఏఐఓసీడీ) ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలోని మెడికల్ షాపులు, కొన్ని ఔషధ సరఫరా సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.
- Harish Thanniru
- Published on- May 14, 2026 / 02:04 PM IST
Medical shop
Medical Shops : దేశవ్యాప్తంగా ఈనెల 20వ తేదీన మెడికల్ షాపులు బంద్ కానున్నాయి. అఖిల భారత కెమిస్టులు, డ్రగ్గిస్టుల సంఘం (ఏఐఓసీడీ) ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలోని మెడికల్ షాపులు, కొన్ని ఔషధ సరఫరా సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ బంద్‌లో 12.40లక్షలకుపైగా కెమిస్టులు, ఫార్మాస్యూటికల్ డిస్ట్రిబ్యూటర్లు పాల్గొంటారని ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్ ప్రకటించింది.
పెద్ద కార్పొరేట్ కంపెనీల అండదండలతో నడుస్తున్న ఆన్‌లైన్ ఫార్మసీలు భారీ డిస్కౌంట్లు ఇస్తూ సంప్రదాయ మెడికల్ షాపులకు నష్టం కలిగిస్తున్నాయని కెమిస్టులు వాపోతున్నారు. చిన్న ఫార్మసీలు ఈ పోటీని తట్టుకోలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆన్‌లైన్ కంపెనీలు తక్కువ ధరలకు మందులు అమ్మడం వల్ల స్థానిక వ్యాపారులు నష్టపోతున్నారని ఆరోపిస్తున్నారు. కార్పొరేట్ కంపెనీల భారీ డిస్కౌంట్లను ఆపాలని అదేసమయంలో కల్తీ ఔషధాలను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ ఏఐఓసీడీ 20న దేశవ్యాప్త సమ్మె చేపట్టనుంది. దీనికి మద్దతుగా రాష్ట్రంలోని మందుల షాపుల యాజమానులు, డీలర్లు బంద్ పాటించడానికి సిద్ధమయ్యారు.
మెడికల్ షాపుల బంద్ పై ఏలూరు కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు గుత్తా రవిచంద్ర మాట్లాడుతూ.. ఈనెల 20వ తేదీన దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు సమ్మెలో పాల్గొంటాయని తెలిపారు. 19వ తేదీ అర్ధరాత్రి 12గంటల నుంచి 20వ తేదీ అర్ధరాత్రి 12గంటల వరకు మెడికల్ షాపులు బంద్ ఉంటాయని చెప్పారు.
ఆన్‌లైన్ ఫార్మసీ నియంత్రించాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే ప్రజారోగ్యంకు ప్రమాదం పొంచి ఉందని, డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌లు మిస్‌యూజ్ అవుతున్నాయని, డ్రగ్స్ కూడా విచ్చవిలవిడిగా ఆన్‌లైన్‌లో విక్రయాలు అవుతున్నాయని అన్నారు. కార్పొరేట్ సెక్టార్లు ఇస్తున్న డిస్కౌంట్లు నియంత్రించాలని, ధరల నియంత్రణ విషయంలో నిబంధనలు పాటించకుండా నేషనల్ ప్రైజ్ అథారిటీ ప్రకారం విక్రయాలు చేయాలని ఆయన కోరారు. ఈ రంగంపై దేశవ్యాప్తంగా 12లక్షల 40వేల కుటుంబాలు, ఐదు కోట్ల మంది ప్రజలు ఉపాధి పొందుతున్నారని, ఆన్ లైన్ ఫార్మసీ వల్ల వ్యాపారాలు తగ్గిపోయి ఉపాధి కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. పేషెంట్లకు కోవిడ్ సమయంలో మందులు డోర్ డెలివరీ చేసేందుకు ఇచ్చిన అవకాశాన్ని నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదిలాఉంటే.. ఈ అంశంపై పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసినప్పటికీ సరైన చర్యలు తీసుకోలేదని AIOCD పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యేక వినతిపత్రం కూడా పంపింది. ఈనెల 20వ తేదీన బంద్ నేపథ్యంలో అత్యవసర మందులు ముందుగానే కొనుగోలు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
