Kerala CM VD Satheesan : కేరళం సీఎంగా వీడీ సతీషన్.. అధికారికంగా ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం.. ఎవరీ సతీషన్.. ఇతన్నే ఎందుకు ఎంపిక చేశారంటే?
Kerala CM VD Satheesan : కేరళ ముఖ్యమంత్రి పేరును కాంగ్రెస్ కేంద్ర పార్టీ అధిష్టానం ఫైనల్ చేసింది. సీఎంగా సతీశన్ పేరును అధిష్టానం ప్రకటించింది.
VD Satheesan
Kerala CM VD Satheesan : కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కూటమిలో అత్యధిక స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఈనెల 4న ఫలితాలు వెల్లడికాగా.. అప్పటి నుంచి కేరళ ముఖ్యమంత్రి పీఠాన్ని ఎవరు అదిరోహిస్తారోననే ఉత్కంఠ కొనసాగుతూ వచ్చింది. ఈ క్రమంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే, తాజాగా.. కేరళం ముఖ్యమంత్రి పేరును కాంగ్రెస్ కేంద్ర పార్టీ అధిష్టానం ఫైనల్ చేసింది. సీఎంగా సతీషన్ పేరును అధిష్టానం ప్రకటించింది.
Also Read : Petrol Stations Closed : ఇక నుంచి ప్రతి ఆదివారం పెట్రోల్ బంక్‌లు బంద్ కానున్నాయా..? క్లారిటీ ఇదే..
వీడీ సతీషన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. ఆయన ఎర్నాకుళం జిల్లాలోని నెట్టూరులో 31 మే 1964లో జన్మించారు. సోషల్ వర్క్ లో మాస్టర్స్ చేశారు. ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం చేసిన సతీషన్.. కేరళ హైకోర్టులో న్యాయవాదిగానూ ప్రాక్టీస్ చేశారు. కాంగ్రెస్ విద్యార్థి విభాగం నుంచి రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు. పరవూరు నియోజకవర్గం నుంచి ఆయన ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2026 కేరళం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో వీడీ సతీషన్ కీలక భూమిక పోషించారు.
కేరళం రాష్ట్రంలో మొత్తం 140 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. యూడీఎఫ్ కూటమి 102 స్థానాల్లో విజయం సాధించి స్పష్టమైన మెజార్టీని దక్కించుకుంది. ఇందులో ఒక్క కాంగ్రెస్ పార్టీయే 63 స్థానాల్లో విజయం సాధించడం విశేషం. మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కేవలం 35 స్థానాలకే పరిమితమై అధికారాన్ని కోల్పోయింది. ముఖ్యంగా మలబార్ రీజియన్‌లో ముస్లీం లీగ్ (ఐయూఎంఎల్)తో కలిసి కాంగ్రెస్ క్లీన్‌స్వీప్ చేసింది. దీంతో దశాబ్ద కాలం తరువాత కేరళంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి పాలనాపగ్గాలు చేపట్టనుంది.
సీఎం పీఠంకోసం పట్టుపట్టిన సతీషన్..
వీడీ సతీషన్ కేరళం రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేడంలో కీలక భూమిక పోషించారు. ఐదేళ్లుగా కేరళం అసెంబ్లీలో ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన సమర్ధవంతంగా పోరాడారు. అయితే, కాంగ్రెస్ కేంద్ర పార్టీ అధిష్టానం సీఎం పదవికి కేసీ వేణుగోపాల్ పేరును పరిశీలించింది. చివరి నిమిషం వరకు ఆయనే కేరళం సీఎం అవుతారని నేషల్ మీడియాలోనూ విస్తృత ప్రచారం జరిగింది. దీంతో సీఎం పదవి కోసం కేసీ వేణుగోపాల్, వీడి సతీషన్ మధ్య తీవ్ర పోటీ ఏర్పడినప్పటికీ.. సీఎం పదవి కోసం వీడి సతీషన్ పట్టుబట్టినట్లు సమాచారం.
సీఎం పదవి ఇవ్వండి.. లేదంటే నాకు ఎలాంటి పదవులు వద్దు అంటూ కాంగ్రెస్ అధిష్టానంకు వీడీ సతీషన్ స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ సైతం చివరి నిమిషంలో కేసీ వేణుగోపాల్‌ను కాదని.. వీడి సతీషన్ వైపు మొగ్గు చూపినట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరోవైపు ప్రస్తుతం కేసీ వేణుగోపాల్ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి ఆయన సేవలు అవసరం అని గుర్తించిన పార్టీ అధిష్టానం.. చివరి నిమిషంలో వీడీ సతీషన్‌ను కేళం సీఎంగా ఫైనల్ చేసినట్లు చెబుతున్నారు.
