శభాష్ శంభూ: కేరళలో కరోనాని కనుక్కొన్న డాక్టర్

  • Publish Date - March 13, 2020 / 06:25 AM IST

కేరళ రాష్ట్రంలో కరోనా వ్యాధిగ్రస్తులు రోజురోజుకు పెరుగుతుండడంతో హై అలర్ట్ ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. ఇప్పటివరకూ 3వేల మందిని పర్యవేక్షణలో ఉంచినట్టు ఆరోగ్య శాఖ మంత్రి శైలజ ప్రకటించారు. వైరస్ అనుమానితుల నుంచి మొత్తంగా 1,1179 శాంపిల్స్ పంపినట్లు చెబుతున్నారు అధికారులు. భారత్‌లో ఫస్ట్ పాజిటివ్ కేసు కేరళలో నమోదైంది. చైనాలోని వూహన్ నుంచి వచ్చినవారికి కరోనా సోకినట్లుగా అప్పుడు గుర్తించారు. అయితే కొన్ని రోజుల తర్వాత వారికి నయం అయ్యింది. అయితే వైరస్ వ్యాప్తి రెండో రౌండ్లో రాష్ట్రంలో 14 కరోనావైరస్ కేసులు నిర్ధారించబడ్డాయి. దీంతో కేరళ అలర్ట్ అయ్యింది.

ముగ్గురు ప్రయాణికులు ఇటలీ నుంచి కొచ్చిన్ అంతర్జాతీయ విమానశ్రయానికి వచ్చి అధికారుల కంటపడకుండా మెల్లగా అక్కడి నుంచి జారుకున్నారు. ఆ తర్వాత వారిలో కరోనా వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. అలోగా ఈ ముగ్గురి నుంచి బంధవుల్లో ఎనిమిదికి వైరస్ సోకింది. అయితే ఓ డాక్టర్ అనుమానం వ్యాధిని గుర్తించడానికి దారితీసింది. రాణి ప్రభుత్వ తాలూకా ఆసుపత్రికి చెందిన డాక్టర్ శంభూ. అనుమానం లేవనెత్తడంతో  వ్యాధి వ్యాప్తి చెందే వ్యక్తుల సంఖ్య తగ్గింది. (వంటింటి వైద్యంతో కరోనాను కట్టడి చేసిన చైనా వైద్యుడు)

జ్వరంతో బాధపడుతున్న ఓ రోగి డాక్టర్ శంభూని కలిసినప్పుడు.. వారు ఇటీవల ఏ విదేశీ దేశాలకు వెళ్ళారా? అని ప్రశ్నించారు. అయితే ఆ రోగి ఏ దేశానికి వెళ్లలేదు అని సమాధానం ఇచ్చారు.  అయితే శంభూ రోగిని తన బంధువులు, స్నేహితులు లేదా పొరుగువారు ఎవరైనా విదేశాల నుండి వచ్చారా అని అడిగారు. అప్పుడు అసలు విషయం బయటకు వచ్చింది. ఇటలీ నుంచి వచ్చిన ఓ కుటుంబం గురించి తెలిసింది. ఫలితంగా వైరస్ వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకున్నారు.(అనంతపురం జిల్లాలో ఇద్దిరికి కరోనా లక్షణాలు?)

డాక్టర్ శంభూని ఇప్పుడు సోషల్ మీడియాలో అభినందిస్తున్నారు.  నటుడు అజు వర్గీస్ కూడా తన ఎఫ్‌బీ పేజీలో శంభూ గురించి పోస్ట్ చేశారు. చెంగన్నూర్ కు చెందిన డాక్టర్ శంబు కోజికోడ్ వైద్య కళాశాల నుండి మెడిసిన్ విద్య పూర్తి చేశారు. డాక్టర్ లయా మురళీధరన్ ఆయన భార్య.