ఈ మాస్క్ ధర అక్షరాల రూ.2లక్షల 89వేలు

  • Publish Date - July 4, 2020 / 09:02 AM IST

కరోనా వైరస్ మహమ్మారి నుంచి మనల్ని కాపాడుకునేందుకు ఉన్న ఏకైక మార్గం మాస్క్ ధరించడం. దీంతో యావత్ ప్రపంచం మాస్కుల బాట పట్టింది. కాగా, మార్కెట్ లోకి రకరకాల మాస్కులు వచ్చాయి. బ్రాండ్ ను బట్టి వాటి ఖరీదు ఉంటుంది. కొన్ని మాస్కుల ధర 50 రూపాయల లోపు ఉంది. కొన్నింటి ఖరీదు వందలు, వేల రూపాయాల్లో ఉంది. కానీ ఆ మాస్క్ ధర మాత్రం అక్షరాల రూ.2లక్షల 89వేలు. ఏంటి, షాక్ అయ్యారా. కానీ ఇది నిజం. ఎందుకంత కాస్ట్లీ, అందులో ప్రత్యేకత ఏముంది? అనే సందేహం రావొచ్చు. అవును ఆ మాస్క్ వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే దాన్ని బంగారంతో చేశారు మరి.

ఐదు వేళ్లకు ఐదు గోల్డ్ రింగ్స్:
మహారాష్ట్రలోని పుణెకి చెందిన ఓ వ్యక్తి ధరించిన ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది. గోల్డ్ తో చేసిన అతడి మాస్క్ ధర అక్షరాల రూ.2లక్షల 89వేలు. పుణెలోని పింప్రి-చించ్వాడ్ కు చెందిన శంకర్ అనే వ్యక్తి ఈ ఖరీదైన మాస్క్ ను ధరిస్తున్నాడు. ఈ మాస్క్ లో చిన్న చిన్న రంధ్రాలు ఉన్నాయి. దీంతో శ్వాస తీసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదని అతడు చెప్పాడు. అయితే కరోనా వైరస్ నుంచి కాపాడటంలో ఈ మాస్క్ ప్రభావవంతంగా పని చేస్తుందో లేదో అనే విషయం మాత్రం తనకు తెలియదన్నాడు శంకర్. కాగా, శంకర్ ఒంటి నిండా బంగారం కనిపిస్తోంది. ఆయన చేతికి బంగారంతో చేసిన కడియం ఉంది. ఇక ఐదు వేళ్లకు ఐదు బంగారు ఉంగరాలు ఉన్నాయి. దీన్ని బట్టి శంకర్ బాగా రిచ్ అనే విషయం అర్థమవుతోంది.

శంకర్ బాబు, దొంగలతో జాగ్రత్త:
ఈ గోల్డ్ మాస్క్ ఇప్పుడు వైరల్ గా మారింది. దీన్ని ధరిస్తున్న కారణంగా శంకర్ ఇప్పుడు సెలబ్రిటీ అయిపోయాడు. అయితే కాస్త జాగ్రత్తగా ఉండాలని నెటిజన్లు శంకర్ కి సూచిస్తున్నారు. అసలే బంగారం ధర భగభగమంటోంది. తులం పుత్తడి రూ.50వేలు పలుకుతోంది. ఈ పరిస్థితుల్లో దొంగలతో జాగ్రత్త అని చెప్పారు. కాగా కొందరు నెటిజన్లు శంకర్ తీరుపై విమర్శలు చేశారు. డబ్బు ఉంది కదా అని ఇలా ఓవరాక్షన్ చేయడం కరెక్ట్ కాదన్నారు. ఆ మాస్క్ తయారీకి అయిన 2లక్షల రూపాయలతో వేల సంఖ్యలో గుడ్డతో చేసిన మాస్కులు కుట్టించి పేదవారికి ఉచితంగా పంచొచ్చు కదా అని ఒక నెటిజన్ సలహా ఇచ్చాడు. దేశంలో ఆర్థిక అసమానతలకు ఇది నిలువెత్తు నిదర్శనం అని మరొకరు కామెంట్ చేశారు. డబ్బు ఉన్నంత మాత్రాన ఇలా బిల్డప్ ఇవ్వడం కరెక్ట్ కాదని మరొకరు మండిపడ్డారు. మాస్కు మాత్రమే కాదు గోల్డ్ తో పీపీఈ కిట్ కూడా చేయించుకోకపోయావా అని మరో నెటిజన్ సెటైర్ వేశాడు. కాగా, పింప్రి-చించ్వాడ్ లో కరోనా కేసుల సంఖ్య 3వేల 284కి పెరిగింది. కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 47కి చేరింది.

Read:Home Isolation న్యూ రూల్స్ తెలుసుకోండి