Meghalaya honeymoon Case
పెళ్లి తర్వాత ప్రతి జంట హనీమూన్‌కు వెళ్లాలని కలలుకంటారు. హనీమూన్ ఓ మధురానుభూతి ఇస్తుంది. కానీ ఇటీవల మేఘాలయలో హత్యకు గురైన రాజా రఘువంశీ పాలిట మాత్రం అదే యమపాశమైంది. మేఘాలయ కొండల్లో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ హాయిగా భర్తతో గడపాల్సిన భార్యే.. ప్రియుడి కోసం దారుణానికి ఒడిగట్టింది. భర్తను చంపించింది. దేశాన్ని కుదిపేసిన ఈ హనీమూన్ హత్య కేసులో ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీతోపాటు మరో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా, ఇప్పుడు విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.
రఘువంశీని హత్యచేసిన తరువాత ఆధారాలను లభించకుండా సోనమ్ అనేక ప్రయత్నాలు చేసింది. రఘువంశీ హత్య తరువాత సోనమ్ తన ఫోన్ ను స్విచ్ఛాఫ్ చేసింది. రాజ్ కుష్వాహా, ఇతరులను సంప్రదించడానికి మరో ఫోన్ ను ఉపయోగించింది. జూన్ 9న ఘాజీపూర్ ధాబా వద్దకు వెళ్లిన సోనమ్ తన సోదరుడిని సంప్రదించేందుకు ప్రయత్నించింది. ధాబా యాజమాని ఫోన్ నుంచి తన సోదరుడికి కాల్ చేసే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో పలు ఫోన్ నెంబర్ల కోసం ఆమె తన ఫోన్ ను ఆన్ చేసింది. దీంతో మేఘాలయ, మధ్యప్రదేశ్ పోలీసులు ఎస్ఓఎస్ ద్వారా మమ్మల్ని అప్రమత్తం చేశారని ఉత్తరప్రదేశ్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
సోనమ్ ధాబాలో ఉన్న సమయంలో తన ఫోన్‌ను ఆన్ చేసినప్పటికీ వెంటనే స్విచ్ఛాఫ్ చేసింది. అయితే, అప్పటికే పోలీసులు ఫోన్ సిగ్నల్ ద్వారా ఆమె వెళ్లిన ధాబాను గుర్తించారు. వెంటనే ఓ టీం ధాబా వద్దకు వెళ్లి వివరాలను సేకరించింది. సోనమ్ ఇండోర్ లో మూడు ఫోన్లను కొనుగోలు చేసింది. వీటిలో ఒక కీప్యాడ్ -మోడల్, రెండు ఆండ్రాయిడ్ సెట్ లు ఉన్నాయి. సహ నిందితుడు ఆనంద్ కుర్మీకి చెందిన గుర్తింపు పత్రాలతో ఈ ఫోన్లు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఫోన్లు కొనుగోలు చేయడానికి రాజ్ సహాయం చేశాడని పోలీసులు తెలిపారు.
ఇండోర్ లోని ఓ ప్రాంతంలో లాగ్‌బుక్ ఎంట్రీలు పోలీసు రికార్డులతో సరిపోలాయి. డిజిటల్ పాదముద్రలను చెరిపేయడానికి మేఘాలయలో ఈ ఫోన్లు, సిమ్‌లను నిందితులు ధ్వంసం చేశారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం సోనమ్ తోపాటు మరో నలుగురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. రఘువంశీ హత్యకు సంబంధించి నింధితుల నుంచి విచారణలో పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.