migrant workers : వచ్చేస్తున్నాం తిరిగి పనిలో చేరుతున్నాం..అంటున్నారు వలస కార్మికులు. కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ తో సొంతూళ్లకు వెళ్లిన వలస కార్మికులు మళ్లీ నగరాలకు పయనమౌతున్నారు. సొంత ప్రాంతాలకు వెళ్లిన వారిలో 70% వరకు మళ్లీ నగరాలు, గతంలో పనిచేసిన చోట్లకు వచ్చేందుకు మొగ్గుచూపుతున్నారు.
మాజీ ప్రభుత్వ అధికారులు, విద్యావేత్తల ఆధ్వర్యంలో ‘మైగ్రెంట్ వర్కర్స్ : ఏ స్టడీ ఆన్ దెర్ లైవ్లీహుడ్ ఆఫ్టర్ రివర్స్ మైగ్రేషన్ డ్యూటు లాక్‌డౌన్’శీర్షికతో నిర్వహించిన ఇన్ఫెరెన్షియల్ సర్వే స్టాటిస్టిక్స్, రీసెర్చ్ ఫౌండేషన్ అధ్యయనంలో అనేక అంశాలు వెల్లడయ్యాయి.
ఈ ఫౌండేషన్‌ను నేషనల్ శాంపిల్‌సర్వే ఆఫీస్ రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ బి.బి.సింగ్, కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మాజీ ఆర్థిక సలహాదారు ఎన్‌కే సాహు తదితరులు స్థాపించారు. ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, ఛత్తీస్‌గఢ్‌ల నుంచే ఎక్కువ సంఖ్యలో కార్మికులు వలస వస్తున్న నేపథ్యంలో.. ఈ రాష్ట్రాల్లోనే ఈ అధ్యయనం నిర్వహించారు.
నగరాలు, గతంలో తాము పనిచేసిన ప్రాంతాలకు తిరిగి వెళ్లేందుకు 70% వలసకార్మికులు సుముఖంగా ఉన్నారని వెల్లడించింది. జార్ఖండ్ నుంచి 92.31%, యూపీ నుంచి 89.31%, ఒడిశా నుంచి 59 శాతంమంది సిద్ధమౌతున్నారని, పశ్చిమబెంగాల్ నుంచి 35 శాతం మంది మళ్లీ నగరాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారని తాజా నివేదిక వెల్లడించింది.
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు అకస్మాత్తుగా విధించిన లాక్‌డౌన్‌తో వలస కార్మికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఉపాధి లేకపోవడంతో..సొంతూళ్లకు వెళ్లిపోయారు. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఒక కోటి 4 లక్షల మంది వలసకార్మికులు తమ ఊళ్లకు చేరుకున్నట్టుగా సర్వేలో వెల్లడైంది. లాక్‌డౌన్ సమయంలోనే 94% ఆదాయాలు తగ్గిపోయినట్టుగా తాజా సర్వేలో వెల్లడైంది.