Miss World 2021 : శ్రీ షైనీ విజయగాధ.. ముఖం కాలిపోయింది, కృంగిపోలేదు

ప్రపంచ అందాల పోటీల్లో రన్నరప్‌గా నిలిచిన భారత మూలాలు ఉన్న యువతి శ్రీ షైనీ విజయగాథ ఇది. గుండె సంబంధిత సమస్యలతో బాధ.. అందరి గుండె నిమిషానికి 72...

Miss World 2021

Shree Saini : జీవితంలో చేదును.. తీపిగా మలుచుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. కష్టాలు, నష్టాలు, అవమానాలు ఎదురైనా.. ఓర్చుకుంటూ ముందుకు సాగడమే సిసలైన జీవిత ప్రయాణం. ముఖంపై కాలిన గుర్తులు.. గుండెపై చెరిపేయలేని గాయాలు.. చిన్నవయసులోనే మోయలేనంతగా బాధల్ని చవిచూసింది.. కానీ, తొణకలేదు.. కన్నీళ్లను తుడుచుకుంది.. ఎదురించి పోరాడింది.. ఫైనల్‌గా తన కలకు అతిసమీపానికి వెళ్లి ఒక్క అడుగు దూరంలో నిలిచింది. ప్రపంచ అందాల పోటీల్లో రన్నరప్‌గా నిలిచిన భారత మూలాలు ఉన్న యువతి శ్రీ షైనీ విజయగాధ ఇది. గుండె సంబంధిత సమస్యలతో బాధ.. అందరి గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటే.. ఆమెకు కేవలం 20 సార్లు మాత్రమే కొట్టుకునేది. అందరి పిల్లల్లాగా ఆడుకోలేదు.. చివరికి.. పన్నెండో ఏట జరిగిన ఓపెన్‌ హార్ట్ సర్జరీతో కృత్రిమ గుండె అమర్చితే గానీ బతకలేదు. అంతే.. అక్కడి నుంచి ఇక వెనుదిగిరి చూడలేదు. విశ్వ వేదికపై అందాల కిరీటం అందుకునే వరకు వెళ్లి.. ఒక్క అడుగు దూరంలో నిలిచింది భారత సంతతికి చెందిన శ్రీ షైనీ.

Read More : Miss World 2021: మిస్ వరల్డ్‌ 2021 కిరీటాన్ని సొంతం చేసుకున్న పోలాండ్ బ్యూటీ కరోలినా బిలావ్స్కా

ప్యూర్టో రికా, శాన్‌ జువాన్‌లో మిస్‌ వరల్డ్ 2021 పోటీలు ఘనంగా జరిగాయి. పోలాండ్‌ సుందరి కరోలీనా బెయిలాస్కా ప్రపంచ సుందరి టైటిల్‌ నెగ్గింది. మాజీ సుందరి జమైకాకు చెందిన టోనీ అన్‌సింగ్‌.. ప్రపంచ సుందరి కిరీటంతో కరోలీనాను సత్కరించింది. మొదటి రన్నరప్‌గా మిస్‌ అమెరికా 2021 శ్రీ షైనీ నిలవగా.. రెండో రన్నరప్‌గా పశ్చిమ ఆఫ్రికా కోట్‌ డీల్వోరికు చెందిన ఒలీవియా యాసే నిలిచింది. ఈ ముగ్గురిలో శ్రీ షైనీ.. ఇండో అమెరికన్‌. మిస్‌ వరల్డ్‌ ఫస్ట్‌ రన్నరప్‌ శ్రీ షైనీ స్వస్థలం పంజాబ్‌లోని లూథియానా. ఆమె ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు ఆమె కుటుంబం వాషింగ్టన్‌కు వలస వెళ్లింది. పసితనం నుంచే ఆమె అడుగులు.. ముళ్ల బాటలో సాగాయి. సవ్యంగా సాగుతున్న శ్రీ షైనీ జీవితంపై మరో పిడుగు పడింది. ఓ రోడ్డు ప్రమాదంలో ఆమె ముఖం బాగా కాలిపోయింది. కానీ, శ్రీ షైనీ కుంగిపోలేదు. ఆమె కోలుకోవడానికి ఏడాది టైం పడుతుందని వైద్యులు చెప్పారు.

Read More : Miss world 2021 : మిస్ వరల్డ్ పోటీలు వాయిదా, హైదరాబాద్ మానసకు కరోనా

కానీ, రెండు వారాలకే ఆమె తరగతి గదిలో అడుగుపెట్టింది. చిన్నతనంలోనే ప్రపంచ సుందరి కావాలన్న కల నెరవేర్చుకునేందుకు.. ప్రయత్నించింది శ్రీ షైనీ. కాలిన ఆ మరకలను సహజంగా తగ్గించుకునే ప్రయత్నం చేసింది. అందాల పోటీల్లో పాల్గొంది. 2020లో మిస్‌ వాషింగ్టన్ వరల్డ్‌గా గెలిచింది. ఆపై మిస్‌ అమెరికా 2021 కిరీటం దక్కించుకుంది. మిస్‌ అమెరికా ఫైనల్‌ పోటీలకు ముందురోజు.. స్టేజ్‌ మీదే కుప్పకూలిన ఆమె ఆస్పత్రి పాలైంది. అయినా ఆ మరుసటి రోజు నెర్వస్‌ను పక్కనపెట్టి కిరీటాన్ని దక్కించుకుంది. ఆమె స్ఫూర్తిదాయకమైన ప్రయాణానికి గానూ.. మిస్‌ వరల్డ్‌ బ్యూటీ విత్‌ ఏ పర్పస్‌ అంబాసిడర్‌ హోదా కూడా దక్కింది శ్రీ షైనీకి. మిస్ వరల్డ్ రన్నరప్‌గా నిలిచిన తర్వాత ఇన్‌స్టాలో ఆమె చేసిన పోస్ట్‌ చూస్తే ఎవరికైనా గుండె బరువెక్కక మానదు. ముఖంపై కాలిన గాయాలు, గుండె లోపాన్ని అధిగమించిన నా కథ.. రోజువారీ సవాళ్లను అధిగమించడానికి పడ్డ కష్టం.. ఇతరులకు స్ఫూర్తినిస్తుందని అనుకుంటున్నా అని పోస్ట్ చేసింది. ఆరేళ్ల వయస్సులో ఉన్నప్పుడు వేసుకున్న మిస్ వరల్డ్ వేషాన్నే జీవిత గమ్యంగా మార్చుకొని కష్టాలను ఎదురొడ్డి నిలిచింది.. విశ్వ వేదికపై సగర్వంగా తలెత్తుకున్న శ్రీ షైనీ ఓ సూపర్‌ హీరో..!