Udhayanidhi Stalin
Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్ హీరోగా మరో సినిమా మొదలైంది. ఈ సినిమా షూటింగ్ తాజా షెడ్యూల్ శుక్రవారం పుదుచ్చేరిలో మొదలవగా ఉదయనిధి కూడా షూటింగ్ లో పాల్గొన్నాడు. ఈ సినిమాలో ఉదయనిధికి జంటగా నిధి అగర్వాల్ నటిస్తుండగా.. కలైయరసన్ మరో ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. బిగ్‌బాస్ రియాల్టీ షో ప్రేమ్ ఆరవ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు మగిళ్ తిరుమేణి దర్శకత్వం వహిస్తున్నారు.
కాగా, ఉదయనిధికి ఈ సినిమా స్పెషల్ కానుంది. ఎందుకంటే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఉదయనిధికి ఇదే తొలిసినిమా. అంతేకాదు.. పార్టీ యూత్ అధ్యక్షుడిగా.. చెపాక్ – తిరువళ్లికేని నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా సేవలందిస్తూనే నటుడిగా కూడా బ్యాలెన్స్ చేసేందుకు సిద్దమయ్యాడు. తమిళనాడు రాష్ట్రం నుండి నటుడిగా చిన్న వయసులో ఎమ్మెల్యేగా గెలిచి రికార్డ్ సొంతం చేసుకున్న ఉదయనిధి ఇప్పుడు రెండు రంగాలలో రాణించేందుకు సిద్దమై మరో సాహసానికి తెరలేపాడు.
ఇప్పటికే ఇలా ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉంటూనే సినిమా రంగంలో కొనసాగిన వాళ్ళు ఉండగా వారిలో రెండు రంగాలను బ్యాలెన్స్ చేసి సక్సెస్ సాధించిన వారు చాలా తక్కువ. ప్రస్తుతం తెలుగులో బాలకృష్ణ అటు అసెంబ్లీకి వెళ్తూనే.. వరస సినిమాలను చేస్తుండగా.. రోజా ఎమ్మెల్యేగా ఉంటూనే బుల్లితెర మీద ఫుల్ బిజీగా గడుపుతుంది. ఇప్పుడు తమిళంలో ఉదయనిధి మళ్ళీ సినిమాలను మొదలు పెట్టాడు. మరి.. ఉదయనిధి రెండు రంగాలను బ్యాలెన్స్ చేస్తూ సక్సెస్ కాగలడా లేదా అన్నది కొన్నేళ్లు గడిస్తే తెలియనుంది.