పౌరసత్వ బిల్లుపై కమల్ ఘాటు వ్యాఖ్యలు

దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు,మేధావులు పౌరసత్వ సవరణ బిల్లుపై నిరసన గళం వినిపిస్తున్నారు. ఈ బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకోవాలంటూ 625మంది మేధావులు కేంద్రప్రభుత్వానికి విజ్ణప్తి చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే లోక్ సభలో పాస్ అయిన ఈ బిల్లును ఇవాళ రాజ్యసభలో ప్రవేశపెట్టింది కేంద్రప్రభుత్వం. పౌరసత్వ సవరణ బిల్లుపై రాజ్యసభలో చర్చ జరుగుతున్న సమయంలో మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత, ప్రముఖ నటుడు కమల్ హాసన్ స్పందించారు. పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. 

బుధవారం చెన్నైలో మీడియాతో మాట్లాడిన ఆయన… పౌరసత్వ సవరణ బిల్లు ద్వారా ఇండియాను కేవలం ఒక సమూహానికి చెందిన దేశంగా మార్చడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కమల్ హాసన్ ఆరోపించారు. వ్యాధిలేని వ్యక్తికి శస్త్రచికిత్స చేయడం ఎంత పెద్ద నేరమో, పౌరసత్వ బిల్లుకు సవరణలు చేయడం కూడా అంతే తప్పన్నారు. రాజ్యాంగంలో లోపాలుంటే సరిచేయడం మంచిదే కానీ లోపాలే లేని చోట సరి చేయాలనుకుంటే అది ప్రజలకు, ప్రజాస్వామ్యానికి చేటు చేస్తుందన్నారు.

పౌరసత్వ సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపితే పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చే ముస్లింమేతర శరణార్థులకు భారత పౌరసత్వం ఇవ్వడానికి మార్గం సుగమం అవుతుందన్న విషయం తెలిసిందే. అయితే ఈ బిల్లు రాజ్యాంగ విరుద్దం అంటూ కాంగ్రెస్ సహా పలు రాజకీయ పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.