Hc
Uniform Civil Code ఆధునిక భారతదేశానికి ఉమ్మడి పౌర స్మృతి(UCC) అవసరం చాలా ఉందని శుక్రవారం ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. మన దేశంలో..పెళ్లి, విడాకులు, దత్తత, వారసత్వం వంటి విషయాలకు వర్తించే చట్టాలు వేర్వేరు మతాలకు వేర్వేరుగా ఉన్న విషయం తెలిసిందే. అయితే యూనిఫాం సివిల్ కోడ్ (UCC) రియాలిటీ కావాల్సిన అవసరం ఉందని.. తద్వారా వేర్వేరు కమ్యూనిటీలు, తెగలు, కులాలు లేదా మతాలకు చెందిన భారతీయ యువత తమ పెళ్లిళ్ల విషయంలో వివిధ వ్యక్తిగత చట్టాల్లోని వైరుద్ధ్యాల వల్ల తలెత్తే సమస్యలతో పోరాడాల్సిన తప్పనిసరి పరిస్థితి ఉండదని తెలిపింది. మరీ ముఖ్యంగా పెళ్లి, విడాకుల విషయంలో యువత పోరాడవలసిన పరిస్థితులు ఉండకూడదని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. దీనిని అమలు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
కాగా, షెడ్యూల్డ్ ట్రైబ్ గా గుర్తించబడిన”మీన” కమ్యూనిటీకి చెందిన వ్యక్తులకు హిందూ వివాహ చట్టం, 1955 వర్తించడానికి సంబంధించిన కేసులో ఇచ్చిన తీర్పులో జస్టిస్ ప్రతిభ ఎం సింగ్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. వ్యక్తిగత చట్టాల వల్ల ఉత్పన్నమవుతున్న వైరుద్ధ్యాలు న్యాయస్థానానికి పదే పదే వస్తున్నాయని జస్టిస్ ప్రతిభ తెలిపారు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 ఆశించినట్లుగా ఉమ్మడి పౌర స్మృతి అవసరాన్ని సుప్రీంకోర్టు ఎప్పటికప్పుడు చెప్తోందని.. ఇటువంటి పౌర స్మృతి అందరికీ సార్వజనీనంగా వర్తిస్తుందన్నారు. పెళ్లి, విడాకులు, వారసత్వం వంటి విషయాల్లో ఏకరీతి సిద్ధాంతాల వర్తింపునకు దోహదపడుతుందన్నారు. వివిధ వ్యక్తిగత చట్టాల వల్ల ఉత్పన్నమయ్యే వైరుద్ధ్యాలు, అసంగతాలను ఉమ్మడి పౌర స్మృతి తగ్గిస్తుందన్నారు. గత ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఓ వివరణ కోరింది. మతంతో సంబంధం లేకుండా వారసత్వ చట్టాల రూపకల్పనపై అభిప్రాయం చెప్పాలని కోరింది. దీనికి సంబంధించిన ఐదు పిటిషన్లను విచారణకు చేపట్టింది.