కరోనా శాంపిళ్లు ఎత్తుకెళ్లిన కోతులు 

  • Publish Date - May 29, 2020 / 12:29 PM IST

దేశంలో కరోనా రోగుల సంఖ్య పెరుగుతున్నవేళ  ఉత్తర ప్రదేశ్ లో అనూహ్య సంఘటన జరిగింది. కరోనా అనుమానితుల నుంచి  తీసుకున్న శాంపిళ్లను ఒక కోతుల గుంపు ఎత్తుకెళ్లింది.  ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ వైద్య కళాశాల ఆవరణలో ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. దీంతో స్ధానికులు భయాందోళనలకు గురవుతున్నారు. 

ముగ్గురు  కోవిడ్ అనుమానితుల నుంచి సేకరించిన శాంపిళ్లను  ల్యాబ్ టెక్నీషియన్  తీసుకు వెళుతుండగా కోతుల గుంపు అతడిపై దాడి చేసింది.   అతడి చేతిలో ఉన్న శాంపిళ్ళు ఎత్తుకెళ్లాయి.  వాటిని ఎత్తుకెళ్లిన కోతుల్లోని ఒక కోతి శాంపిళ్ళను నోటితో పీల్చడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది.

కోతులకు కుడా కరోనా సోకే అవకాశం ఉందని, వీటి ద్వారా కరోనా  వ్యాప్తి చెందే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈవిషయమై  మెడికల్ కాలేజి చీఫ్ సూపరింటెండెంట్  అటవీశాఖ వారికి సమాచారం ఇచ్చారు.