Viral News: రూ.3 లక్షల నగదు బ్యాగ్ ఎత్తుకెళ్లిన కోతులు!

కోతి చేష్టలని మన పెద్దలు ఊరికే అనలే. ఉన్న చోట ఉండవు.. ఎక్కడ ఉన్నా చిందర వందర గందరగోళమే సృష్టిస్తాయి.

Viral News: కోతి చేష్టలని మన పెద్దలు ఊరికే అనలే. ఉన్న చోట ఉండవు.. ఎక్కడ ఉన్నా చిందర వందర గందరగోళమే సృష్టిస్తాయి. వాటికి అవసరం ఉన్నా లేకున్నా అన్నీ కెలికి కావాల్సింది పట్టుకెళ్తాయి. అందుకే కోతులు నివాస పరిసరాలలో కనిపిస్తే ప్రజలు జాగ్రత్తగా ఉంటారు. కానీ, కోతులే కదా ఏం చేస్తాయిలే అనుకుని ఓ వ్యక్తి డబ్బు బ్యాగ్ బైకులోనే వదిలేసి స్నేహితుడిని కలవడానికి ఇంట్లోకి వెళ్లి వచ్చి చూసేసరికి కోతులు ఆ బ్యాగ్ మాయం చేశాయి. ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయి జిల్లా సాండీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ సంఘటన జరిగింది.

ఆశిష్‌సింగ్‌ అనే యువకుడు మరో వ్యక్తికి భూమి అమ్మగా రూ.3 లక్షల నగదు వచ్చింది. ఆ నగదును ఓ బ్యాగ్‌లో పెట్టి బైక్‌ కవర్‌లో ఉంచి లేక్‌పాల్‌ అనే స్నేహితుడిని కలిసేందుకు వెళ్ళాడు. సాండీ పోలీస్‌స్టేషన్‌ వద్ద బైక్‌ను నిలిపి లేక్‌పాల్‌ ఇంట్లోకి వెళ్లి కాసేపు మాట్లాడి తిరిగి వచ్చి చూడగా బైక్‌ కవర్‌లో బ్యాగ్‌ మాయమైంది. బ్యాగ్ కోసం చుట్టూ వెతకగా ఇది కోతుల పనేనని నిర్ధారణకు వచ్చి మరింత వెతకగా ఓ చోట బ్యాగ్ కనిపించింది. దీంతో నగదు కవర్ కోతుల వద్దే ఉందని భావించి వాటిని వెంబడించాడు. కానీ.. చిక్కితే అవి కోతులు ఎందుకు అవుతాయి.

కాసేపు వాటి వెంట పడిన ఆశిష్ చివరికి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు బయల్దేరగా.. ఓ సెక్యూరిటీ గార్డు పిలిచి చిందరవందరగా ఉన్న నగదును తీసుకొచ్చి ఆశిష్‌కు అందించాడు. అదేదో తినే వస్తువులని తీసుకెళ్లిన కోతులు.. తినే వస్తువులు కాకపోవడంతో చిందర వందర చేసి పడేశాయి. సెక్యూరిటీ గార్డు ఆ నగదును ఒకచోటకి చేర్చి నిజాయతీతో బాధితుడికి అందించాడు. మొత్తానికి పోయిన డబ్బులు తిరిగి రావడంతో ఆశిష్‌ ఆనందపడుతూ.. కృతజ్ఞతగా సెక్యూరిటీ గార్డుకు కొంత నగదు కానుక అందించాడు.

ట్రెండింగ్ వార్తలు