బీజేపీ ఎంపీ, టీమిండియా మాజీ క్రికెటర్, బిజెపి ఎంపీ గౌతమ్ గంభీర్‌కు బెదిరింపులు వస్తున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఢిల్లీ పోలీసులకు గంభీర్ ఫిర్యాదు చేశారు.
బీజేపీ ఎంపీ, టీమిండియా మాజీ క్రికెటర్, బిజెపి ఎంపీ గౌతమ్ గంభీర్‌కు బెదిరింపులు వస్తున్నాయి. శుక్రవారం (డిసెంబర్ 20, 2019) అర్ధరాత్రి నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని శనివారం (డిసెంబర్ 21, 2019) ఢిల్లీ పోలీసులకు గంభీర్ ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు, అంతర్జాతీయ ఫోన్ నెంబర్‌తో చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరుతున్నానని ఫిర్యాదులో వెల్లడించారు.
తనకు, తన కుటుంబ సభ్యులకు భద్రతను కల్పించాల్సిందిగా శాహద్ర డిప్యూటీ పోలీస్ కమిషనర్‌కు గంభీర్ విజ్ఞప్తి చేశారు. తనను, తన కుటుంబాన్ని చంపేస్తామని బెదిరిస్తూ ఇంటర్నేషనల్ నెంబర్ల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని తెలిపారు. గంభీర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఫోన్ కాల్స్ ఆధారంగా నెంబర్‌ను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. తగిన భద్రత కల్పిస్తామని పోలీసులు భరోసా ఇచ్చారు.
గౌతమ్ గంభీర్ ప్రస్తుతం బీజేపీ తరపున ఈస్ట్ ఢిల్లీ నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దేశంలో జరుగుతున్న పలు పరిణామాలపై కుండబద్దలు కొట్టినట్టు అభిప్రాయాలను వెల్లడించడం ఆయన ప్రత్యేకత. పౌరసత్వ చట్టానికి అనుకూలంగా గంభీర్ గట్టిగా వానద వినిపించారు.
పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళకారులు తీరును గంభీర్ తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. పోలీసులు ఆత్మరక్షణ కోసం లాఠీచార్జి చేస్తే అందులో తప్పుబట్టాల్సిందేమీ లేదన్నారు. తమపై రాళ్లు విసురుతున్నప్పుడు, ప్రజల ఆస్తులను దహనం చేస్తూ హింసకు పాల్పడుతున్నప్పుడు ఆందోళనకారులను పోలీసులు ప్రతిఘటిస్తారని అభిప్రాయపడ్డారు.
కేవలం నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేస్తే అది తప్పేనని గంభీర్ స్పష్టం చేశారు. హింసకు తావులేని రీతిలో నిరసన చేపడితే ఎవరికీ సమస్య ఉండదంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు.