మాజీ గవర్నర్ మృదుల సిన్హా కన్నుమూత, ప్రధాని సంతాపం

  • Publish Date - November 19, 2020 / 01:52 AM IST

Mridula Sinha passes away : మాజీ గవర్నర్ మృదుల సిన్హా (77) కన్నుమూశారు. తన 78వ పుట్టిన రోజుకు 10 రోజుల ముందు 2020, నవంబర్ 18వ తేదీ బుధవారం ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పలువురు బీజేపీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.



ప్రజాసేవ కోసం ఆమె చేసిన కృషిని మోడీ ప్రశంసించారు. మృదుల ప్రజా సేవకురిలాగా..ఎప్పటికీ గుర్తుంటారని తెలిపారు. గొప్ప నైపుణ్యం కలిగిన రచయిత్రి, ప్రపంచ సాహిత్య రంగానికి సేవలందించారని తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదిక ద్వారా ట్వీట్ చేశారు. ఆమె మరణం చాలా బాధకు గురి చేసిందన్నారు.




మృదుల సిన్హా జీవిత విశేషాలకు వెళితే..1942 నవంబర్ 27వ తేదీన బీహార్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్ జిల్లా ఛప్రా గ్రామంలో జన్మించారు. ఆమె తన రచనలతో సాహిత్య ప్రపంచానికి విస్తృతమైన కృషి చేశారు. చాలా ఏళ్ల నుంచి బీజేపీతో సంబంధాలున్నాయి. దాదాపు 45కి పైగా పుస్తకాలు రాశారు. బీహార్ మాజీ మంత్రి డాక్టర్ రామ్ కృపాల్ సిన్హాతో వివాహం జరిగింది.



బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షరాలిగా, కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని కేంద్ర సామాజిక సంక్షేమ బోర్డు ఛైర్ పర్సన్ గా పనిచేశారు. 2014 ఆగస్టు నుంచి 2019 అక్టోబర్ వరకు గోవా గవర్నర్ గా పనిచేశారు. గోవా ముఖ్యమంత్రులుగా దివంగత మనోహర్ పారికర్, లక్ష్మీకాంత్ పార్సేకర్, ప్రమోద్ సావంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమాలను ఆమె నిర్వహించారు.