Site icon 10TV Telugu

Mumbai Maratha Protest: ముంబైలో మనోజ్‌ జరాంగే దీక్ష.. మరాఠా రిజర్వేషన్లలో కీలక పరిణామం.. దిగొచ్చిన ప్రభుత్వం.. ఇకపై..

Mumbai Maratha Protest

Mumbai Maratha Protest

Mumbai Maratha Protest: మరాఠా రిజర్వేషన్ల ఉద్యమకారులు చేస్తున్న నిరసన ప్రదర్శనతో ముంబై నగర జీవనం స్తంభించిపోతోంది. మరాఠా రిజర్వేషన్ల ఉద్యమకారుల నేత మనోజ్‌ జరాంగే పాటిల్ దక్షిణ ముంబైలోని ఆజాద్‌ మైదానంలో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.

ఐదు రోజులుగా ఆహారం తీసుకోవడం లేదు. నిన్నటి నుంచి మంచి నీరు కూడా తాగడం లేదు. మనోజ్‌ జరాంగే ఆరోగ్య పరిస్థితిని ప్రభుత్వ వైద్యులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఆజాద్‌ మైదానం వద్దకు పెద్ద ఎత్తున మరాఠా రిజర్వేషన్ల ఉద్యమకారులు వస్తున్నారు.

ముంబై నగర జీవనం స్తంభించిపోవడంతో బాంబే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆజాద్‌ మైదానంలో ఆందోళనకారులు ఉండకూడదని ఆదేశించింది. ముంబైలోని ముఖ్యమైన ప్రాంతాల్లో వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి నెలకొందని చెప్పింది.

డిమాండ్లను సాధించుకుంటామని మరాఠా రిజర్వేషన్ల ఉద్యమకారులు అంటున్నారు. దీంతో ఓబీసీ వర్గాలు కూడా ప్రతిస్పందిస్తున్నాయి. మరాఠాలను ఓబీసీలో చేర్చడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు మహారాష్ట్ర మంత్రి, ఓబీసీ నేత ఛగన్‌ భుజ్‌బల్‌ అన్నారు.

మహారాష్ట్రలో ఓబీసీ పరిధిలోని 374 కులాల వారికి ఇప్పుడు 17 శాతం రిజర్వేషన్లు మాత్రమే ఉన్నాయని, ఇక అందులో మరాఠాలను కూడా చేర్చితే ఎలా అని ప్రశ్నించారు. ( Mumbai Maratha Protest)

Also Read: ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే యోచనలో కవిత? ప్రస్తుతం ఈ అంశాల పరిశీలన

మనోజ్‌ జరాంగే డిమాండ్లు ఇవే..

మరాఠా సామాజిక వర్గానికి ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు విద్యా సంస్థల ప్రవేశాల్లో ఓబీసీ కేటగిరీలో 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని మనోజ్‌ జరాంగే డిమాండ్ చేస్తున్నారు. మరాఠ్వాడా ప్రాంతంలోని అందరు మరాఠాలను కున్బీలుగా పేర్కొంటూ ప్రభుత్వ ఉత్తర్వును జారీ చేయాలని మనోజ్ జరాంగే పట్టుబడుతున్నారు.

హైదరాబాద్‌, సాతారా గెజిట్‌లలో పేర్లు ఉన్న మరాఠాలకు కున్బీ సర్టిఫికెట్‌లు జారీ చేసి ఓబీసీ కోటా ప్రయోజనాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ తరువాత అవంద్, బాంబే గెజిట్‌లలో కూడా కున్బీ హోదా ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేస్తున్నారు.

మరాఠా సామాజిక వర్గాలన్నింటినీ కున్బీలుగా ప్రకటించి, ఓబీసీల్లో చేర్చాల్సిందేనని చెప్పారు. దీనిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌ దృష్టి సారించకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామన్నారు.

మంత్రుల హామీ.. 

మరాఠా రిజర్వేషన్ల ఉద్యమకారుల నిరసన ప్రదర్శనతో మహారాష్ట్ర మంత్రులతో ఏర్పాటైన ఓ బృందం.. మనోజ్ జరంగే పాటిల్‌కు ఓ హామీ ఇచ్చింది. హైదరాబాద్‌ గెజిట్ అమలు కోసం ప్రభుత్వ ఉత్తర్వు (జీఆర్) జారీ చేస్తామని, మరాఠ్వాడా మరాఠాలకు కున్బీ హోదా ఇస్తామని పేర్కొంది. ఈ నెలాఖరులోపు నిరసనకారులపై నమోదైన కేసులను ఉపసంహరించడానికి కూడా మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది.

కోర్టు ఆదేశాలు, ప్రభుత్వ హామీపై జరాంగే ఏమన్నారు?

ఇవాళ రాత్రి 9 గంటలలోపు నిరసనకారులు ముంబై వదిలి వెళ్తారని మనోజ్ జరాంగే చెప్పారు. నిరసనకారులలో చాలామంది ఇప్పటికే ముంబై వదిలి వెళ్లారని ఆయన అన్నారు. మరాఠా కోటా సమస్యకు ఆలోగా పరిష్కారం దొరకాలని కోరారు. మరాఠా కోటా నిరసనలో పాల్గొన్న వారిపై కేసులు ఉపసంహరిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఆయన తెలిపారు.

ప్రభుత్వం తన డిమాండ్లలో చాలా వరకు అంగీకరించిందని జరాంగే ప్రకటించారు. అర్హులైన మరాఠాలకు కున్బీ కుల సర్టిఫికెట్లు ఇవ్వాలన్న డిమాండ్ కూడా ఇందులో ఉంది. జరాంగే నిరసనకారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. “మనం గెలిచాం” అని అన్నారు. మంత్రి రాధాకృష్ణ విఖ్యే పాటిల్ నేతృత్వంలోని కమిటీని ఆయన కలిశారు.

ఆజాద్ మైదాన్‌లో నిరసన కొనసాగింపునకు అనుమతి

బాంబే హైకోర్టు కేసు విచారణను రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు వాయిదా వేసింది. చట్టాన్ని ఉల్లంఘించొద్దని హెచ్చరించింది. మనోజ్ జరాంగేకు బుధవారం ఉదయం వరకు ఆజాద్ మైదాన్‌లో నిరసన కొనసాగించడానికి అనుమతిచ్చింది.

Exit mobile version