Mumbai Schools: ఒమిక్రాన్ టెర్రర్.. పెరిగిన కరోనా కేసులు.. స్కూళ్లు మూసివేత

మహారాష్ట్రలో పెరుగుతున్న కరోనావైరస్ కేసుల మధ్య ఆ రాష్ట్ర ప్రభుత్వం 1 నుంచి 8 వ తరగతి వరకు పాఠశాలలను మూసివేయాలని నిర్ణయం తీసుకుంది.

schools open

Mumbai Schools Closed: మహారాష్ట్రలో పెరుగుతున్న కరోనావైరస్ కేసుల మధ్య ఆ రాష్ట్ర ప్రభుత్వం 1 నుంచి 8 వ తరగతి వరకు పాఠశాలలను మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. కొద్దిరోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతుండగా.. ఓమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం జనవరి 31వ తేదీ వరకు పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కాలంలో పిల్లల ఆన్‌లైన్ విద్య కొనసాగుతుంది.

ముంబైలోనూ పాఠశాలలు మూసివేత:
రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న క్రమంలో ముంబైలో కూడా 1 నుంచి 9వ తరగతి వరకు పాఠశాలలను మూసివేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమయంలో 10వ తరగతి, 12వ తరగతులకు మాత్రమే క్లాసులు జరగనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. 11వ తరగతి క్లాసులు ఆన్‌లైన్‌లో మాత్రమే నిర్వహించాలని ఆదేశించింది ప్రభుత్వం.

మహారాష్ట్రలో భారీగా కరోనా కేసులు:
మహారాష్ట్రలో ఆదివారం 11 వేల 877 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజు నమోదైన కేసుల కంటే 2 వేల 707 ఎక్కువ కేసులు నమోదయ్యాయి. 50 ఓమిక్రాన్ కేసులు కూడా నమోదవగా.. మహారాష్ట్రలో ఇదే సమయంలో తొమ్మిది మంది మరణించారు. దీంతో మరణాల సంఖ్య 1 లక్షా 41 వేల 542కి చేరుకుంది.