×
Ad

17 మంది పిల్లలను బంధించిన వ్యక్తిని కాల్చి చంపిన పోలీసులు.. నిందితుడు చిన్నారులను ఎందుకు బంధించాడంటే..?

తాను కొందరిని పలు ప్రశ్నలు అడగాలనుకుంటున్నానని రోహిత్ చెప్పాడు.

ముంబైలో ఓ వ్యక్తి 17 మంది పిల్లలను ఓ గదిలో బంధించాడు. చివరకు అతడిపై పోలీసులు కాల్పులు జరిపి చిన్నారులను రక్షించారు.

జాతీయ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం.. పొవాయ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మహవీర్ క్లాసిక్ బిల్డింగ్‌లో ఓ ఆడిషన్ కోసం 8 నుంచి 14 ఏళ్ల మధ్య వయస్సు ఉండే పిల్లలు వెళ్లారు.

ఆ సమయంలోనే రోహిత్ అనే వ్యక్తి ఆ స్టూడియోలో కొందరు చిన్నారులను బందీలుగా చేసుకున్నాడు. చిన్నారులు ఆ రూమ్‌ అద్దాల నుంచి బయటకు చూస్తూ హెల్ప్ చేయండంటూ ఏడ్చారు.

దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని చిన్నారులను రక్షించడానికి ఆపరేషన్ చేపట్టారు. చిన్నారులను నిందితుడు ఎందుకు బందీలుగా చేసుకున్నాడో తెలుసుకోవాలని పోలీసులు ప్రయత్నించారు. సుమారు రెండున్నర గంటల పాటు నిందితుడితో మాట్లాడే ప్రయత్నాలు చేశారు.

తాను కొందరిని పలు ప్రశ్నలు అడగాలనుకుంటున్నానని రోహిత్ చెప్పాడు. అందుకే పిల్లలను బంధించానని అన్నాడు. తాను తీవ్రవాదిని కాదని రోహిత్ చెప్పాడు. డబ్బులు కూడా అవసరం లేదన్నాడు. తనను రెచ్చగొడితే ఆ ప్రదేశాన్ని మంటల్లో తగలబెడతానని బెదిరింపులకు దిగాడు.

చివరకు పోలీసులు స్టూడియోలోకి ప్రవేశించి రోహిత్‌ను అరెస్ట్ చేశారు. 17 మంది పిల్లలను రక్షించామని పోలీసులు తెలిపారు. అరెస్ట్ అనంతరం జరిగిన కాల్పుల్లో రోహిత్ మృతి చెందాడు.

రోహిత్ ఓ వ్యాపారవేత్త అని, 2017 వరకు పుణేలో ఉండేవాడని, ఆ తర్వాత నుంచి ముంబైలో ఉంటున్నాడని పోలీసులు తెలిపారు. అతడు పిల్లలను ఎందుకు బంధించాడన్న పూర్తి వివరాలు తెలియరాలేదు.