Karnataka Polls
Karnataka Polls: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపంలోకి వచ్చిన తరుణంలో అధికార భారతీయ జనతా పార్టీకి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వోద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం ముస్లింలకు కల్పించిన రిజర్వేషన్లను రద్దు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయవద్దంటూ సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. బసవరాజు బొమ్మై ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై తాజాగా విచారణ చేపట్టిన ధర్మాసనం.. పై విధంగా తేల్చి చెప్పింది. అయితే దీనిపై తదుపరి వాదనలను మే 9 అనంతరం చేపడతామని కోర్టు పేర్కొంది.
Karnataka Polls: గంట లేటయిందని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్‌ను బాయ్‌కాట్ చేసిన మీడియా
దీనికి కొద్ది రోజుల ముందు సైతం ఈ నిర్ణయంపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ రిజర్వేషన్ల రద్దు నిర్ణయం లోపభూయిష్టంగా ఉందని విమర్శించింది. ముస్లింలకు ఇచ్చిన రిజర్వేషన్లను రద్దు చేసి, వారికి బదులుగా వొక్కళిగ, లింగాయత్ సామాజిక వర్గాలకు చెరొక రెండు శాతం చొప్పున రిజర్వేషన్లను కల్పించడాన్ని తప్పుబట్టింది. రాష్ట్ర ప్రభుత్వం హేతుబద్ధత లేకుండా, శాసన సభ ఎన్నికలకు కొద్ది వారాల ముందు ఈ నిర్ణయం తీసుకుందని కోర్టు వ్యాఖ్యానించింది. అసెంబ్లీ ఎన్నికల పోలింగుకు కేవలం కేవలం రెండు వారాల గడువు మాత్రమే ఉంది. అయితే ప్రభుత్వ నిర్ణయంపై సుప్రీం పూర్తి వ్యతిరేకంగా వచ్చిన తీర్పు.. ఎన్నికల్లో ప్రభావం చూపించొచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే అనేక విమర్శల్లో నెట్టుకొస్తున్న బీజేపీకి ఇది ఎదురుదెబ్బే అని చెబుతున్నారు. కర్ణాటక జనాభాలో 13 శాతం మంది ముస్లింలు ఉంటారు.
కర్ణాటక శాసన సభ ఎన్నికల నేపథ్యంలో మార్చి 24న బొమ్మై ప్రభుత్వం చేసిన ప్రకటనలో ముస్లింలకు ఇస్తున్న రిజర్వేషన్లను రద్దు చేస్తున్నట్లు పేర్కొనడం తీవ్ర వివాదానికి దారి తీసింది. వారికి ఇస్తున్న నాలుగు శాతం రిజర్వేషన్లలో రెండు శాతాన్ని వొక్కళిగలకు, రెండు శాతాన్ని లింగాయత్‌లకు కేటాయించినట్లు తెలిపింది. అయితే ముస్లింలకు ఎకనమికల్లీ వీకర్ సెక్షన్స్ (EWS) కేటగిరీలో రిజర్వేషన్లు కల్పిస్తామని పేర్కొంది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అనేక మంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముస్లింల పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతోందని, సమానత్వం, లౌకికవాద సూత్రాలను ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం సరైన అధ్యయనాన్ని నిర్వహించలేదని, శాస్త్రీయమైన సమాచారాన్ని సేకరించలేదని ఆరోపించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ నిర్ణయం వెనుకగల హేతుబద్ధతను ప్రశ్నించింది.