పాకిస్థాన్ ఆర్మీలో భయమా? తిరుగుబాటా?.. సంచలనం సృష్టిస్తున్న లేఖలు.. వైరల్

ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్, మేజర్ జనరల్ ఫైసల్ మెహమూద్ మాలిక్ తమ ఆర్మీ సిబ్బందికి ఓ అడ్వైజరీ జారీ చేసినట్లు ఉన్న లేఖ సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్ అవుతోంది.

Pakistan Army

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో భారత్‌-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. దీంతో భారత్‌ తమ దేశంపై దాడి చేయనుందన్న ఆందోళన పాక్‌ ఆర్మీలో నెలకొంది. యుద్ధ భయంతో పాక్ ఆర్మీలోని చాలా మంది రాజీనామాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

తమ అధికారుల మాటలను పాక్ ఆర్మీ సిబ్బంది లెక్కచేయట్లేదని, తిరుగుబాటు ధోరణితో ఉన్నారని సమాచారం. దీంతో ఏప్రిల్ 26న ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్, మేజర్ జనరల్ ఫైసల్ మెహమూద్ మాలిక్ తమ ఆర్మీ సిబ్బందికి ఓ అడ్వైజరీ జారీ చేసినట్లు ఉన్న లేఖ సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్ అవుతోంది. ధైర్యంగా ఉండాలని, నైతికతను పాటించాలని, ఎప్పటిలాగే దేశం పట్ల విధేయతతో ఉండాలని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు.

పాక్‌ ఆర్మీలో దాదాపు 250 మంది ఆఫీసర్లు, 1200 మంది సైనికులు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఈ వార్తను పాక్ ఆర్మీ, సర్కార్ ఇప్పటివరకు అధికారికంగా ధ్రువీకరించలేదు.

మరోవైపు, భారత్‌-పాక్ ఉద్రిక్తతల మధ్య పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ ఆసీం మునిర్ కూడా కనపడకుండాపోయారని ప్రచారం జరుగుతోంది. పహల్గాం దాడి తరువాతి నుంచి ఆయన అజ్ఞాతంలో ఉన్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. ఆ దాడి జరిగినప్పటి నుంచి ఆయన బయట ఎక్కడా కనపడలేదు.

అసీం మునిర్ తన కుటుంబంతో పాటు దేశాన్ని విడిచివెళ్లిపోయారంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో పాకిస్థాన్ పీఎంవో ఈ నెల 26న ఓ గ్రూప్‌ ఫొటో పోస్ట్ చేస్తూ ఆ ప్రచారంలో నిజం లేదని చెప్పే ప్రయత్నం చేసింది. ఆ గ్రూప్‌ ఫొటోలో పాక్ ప్రధానమంత్రి షెబాజ్ షరీఫ్ తో పాటు జనరల్ మునిర్ కూడా ఉన్నారు. అబోటాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వారు పాల్గొన్నారని పాక్ పీఎంవో పేర్కొంది. అయితే, పాక్ పీఎంవో పోస్ట్ చేసిన ఫొటో చాలా పాతదని కొందరు నెటిజన్లు కామెంట్లు చేశారు.

Also Read: యుద్ధ పరిస్థితులు వచ్చినా సిద్ధంగా ఉండాలి: పవన్ కల్యాణ్ కీలక కామెంట్స్‌