నా కుమారుడు మోడీ, అమిత్ షాల సేవకుడు : కపిల్ గుజ్జర్ తండ్రి వ్యాఖ్య

  • Publish Date - February 6, 2020 / 03:35 AM IST

ఢిల్లీలోని షాహీన్‌బాగ్ దగ్గర కపిల్ గుజ్జర్‌ అనే యువకుడు గాల్లోకి కాల్పుల జరిపిన ఘటన వివాదానికి దారితీసింది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిపిన ఆందోళనలో పాల్గొన్న అతడు రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపాడు. అప్రమత్తమైన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.

ఈ ఘటన పై యువకుడు గుజ్జర్ తండ్రి మాట్లాడుతూ.. తన కుమారుడు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మద్దతుదారుడు అంటూ వ్యాఖ్యానించారు. తనకు తన కుమారుడికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. మరోవైపు పోలీసులు మాట్లాడుతూ.. 25ఏళ్ల గుజ్జర్.. షాహీన్ బాగ్ దగ్గర పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ గాల్లోకి కాల్పులు జరిపాడని చెప్పారు. 

అరెస్ట్ చేసిన సమయంలో తాను ఏఏపీ సభ్యుడిగా అంగీకరించినట్టు కూడా పోలీసులు వెల్లడించారు. దీనికి సంబంధించి ఫొటోలు కూడా పోలీసులు విడుదల చేశారు. ఈ ఫొటోలన్నీ గుజ్జర్ ఫోన్‌లో ఉన్నాయని, అందులో అతడు ఏఏపీ టోపీ ధరించి ఉన్నాడని, పక్కనే ఏఏపీ నేతల్లో సంజయ్ సింగ్, అతిషి కూడా ఉన్నారని పోలీసులు వెల్లడించారు.

ఈ నేపథ్యంలో కపిల్ గుజ్జర్ తండ్రి, అతడి సోదరుడు మాత్రం ఢిల్లీ అధికార పార్టీతో తమకు సంబంధం లేదని కొట్టిపారేశారు. ‘నేను కానీ లేదా నా కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరికి ఏఏపీతో సంబంధం లేదు. గత ఏడాదిలో లోక్ సభ ఎన్నికల ప్రచార సమయంలో అక్కడ అందరితో పాటు కపిల్ కూడా టోపీ ధరించాడు అంతే’ అంటూ గాజే సింగ్ వివరణ ఇచ్చారు. కానీ, కొన్ని గంటల తర్వాత ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు.

‘నా కుమారుడు మోడీ సపోర్టర్. మోడీ, అమిత్ షా అనుచరుడు కూడా’అని అన్నాడు. తన కుమారుడికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు. షాహీన్ బగ్ మీదుగా రోడ్లన్నీ బ్లాక్ చేయడంతో కపిల్ ఇబ్బంది పడ్డాడని, గంటలో వెళ్లాల్సిన పనికి నాలుగు గంటలు ఆలస్యమైందని అన్నాడు. అంతేకాదు.. తన కుమారుడు జాతీయభావాలు కలిగిన వ్యక్తి అని, ఎప్పుడూ హిందుస్థాన్, హిందుత్వాన్ని గురించి గొప్పగా మాట్లాడుతుంటాడని తెలిపాడు.