నందిగ్రామ్ “బ్యాచిలర్స్ వార్”.. భారీ భద్రత నడుమ పోలింగ్

రెండో దశ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. బెంగాల్‌లో 30, అసోంలో 39 అసెంబ్లీ స్థానాలకు గురువారం పోలింగ్‌ జరగనుంది.

Nandigram రెండో దశ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. బెంగాల్‌లో 30, అసోంలో 39 అసెంబ్లీ స్థానాలకు గురువారం పోలింగ్‌ జరగనుంది. మొదటి దశ పోలింగ్‌ సందర్భంగా జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని పోలీసుశాఖ భద్రతను కట్టుదిట్టం చేసింది. సెకండ్‌ ఫేజ్‌లో మమతా బెనర్జీ, సువేందు అధికారి బరిలో నిలిచిన నందిగ్రామ్‌ నియోజకవర్గానికి పోలింగ్ జరగనుంది. దీంతో బెంగాల్‌లో రెండోదశ ఎన్నికలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

2021లో దేశంలో ప్రజలంతా ఎక్కువగా విన్న పేరు.. మాట్లాడుకున్న అంశం ఏదైనా ఉందంటే అది నందిగ్రామ్‌ ఎన్నికలే అన్నట్టుగా మారింది పరిస్థితి.. కారణం బెంగాల్‌పై కాషాయ జెండాను పాతలనుకుంటున్న బీజేపీకి.. మమతను ఓడించడమే టార్గెట్‌గా పెట్టుకోవడం. . దీంతో నందిగ్రామ్‌లో పార్టీ అగ్ర నాయకత్వాన్ని దింపి ప్రచారంతో హోరెత్తించింది. ఏకంగా ప్రధాని మోదీ, అమిత్‌ షా కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.. మమతను ఓడిస్తే చాలు.. పశ్చిమ బెంగాల్‌ తమ హస్తగతం అవుతుందనే కాన్సెప్ట్‌తో కసరత్తులు చేసింది కమలం పార్టీ.

ఓ వైపు బెంగాల్ టైగర్‌ లాంటి మమత.. మరో వైపు నందిగ్రామ్‌నే తన అడ్డగా మార్చుకున్న మాస్‌ లీడర్‌ సువెందు అధికారి.. దీంతో నందిగ్రామ్‌ దంగల్‌లో గెలుపు కోసం సర్వశక్తులు ఇద్దరూ ఒడ్డారు. దాచిన అస్త్రశస్త్రాలను బయటకు తీశారు. సరికొత్త వ్యూహాలను అమలు చేశారు. విమర్శలకు పదును పెట్టారు. దీంతో మమతలో ఎన్నడూ చూడని కోణాలు బెంగాల్‌ ప్రజలకు కనిపించాయి.

నందిగ్రామ్‌లో ఓటర్ల సంఖ్య 2 లక్షల 75 వేలు. ఇందులో 2 లక్షల మంది ఓటర్లు హిందువులే. దీంతో బీజేపీ కండువా కప్పుకున్న సువేందు అధికారి.. రామ జపం ప్రారంభించారు.. పాల్గొన్న ప్రతిసభలో జై శ్రీరామ్‌ అంటూ నినాదాలు ప్రారంభించారు.. దీనికి తోడు మోదీ, షాల ప్రచార అండ.. దీంతో హిందూ ఓటు బ్యాంక్‌ మెల్లిగా బీజేపీ చేతికి జారిపోతున్నట్టు భావించిన మమతా.. తన కొత్త రూపాన్ని ఓటర్ల ముందు ఆవిష్కరించారు. నందిగ్రామ్‌ ఎన్నికల ప్రచారంలో వీల్‌చైర్‌పైనే టెంపుల్ రన్‌ చేశారు.. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.. సభల్లో చండీ మంత్రాలు ఆలపించారు.. అంతేకాదు.. బహుశా తన రాజకీయ జీవితంలో తొలిసారిగా తాను ఓ హిందూ బ్రహ్మణ మహిళనంటూ ప్రకటించుకోవాల్సిన పరిస్థితి మమతా బెనర్జీకి వచ్చింది… ఎన్నికల్లో హిందూ కార్డును ఆమె ఉపయోగించడమూ ఇదే తొలిసారి. బీజేపీ హిందూత్వ ఎజెండాను ఎదుర్కోవాలంటే మమతకు ఇది తప్ప మరో అవకాశం కనిపించి ఉండదన్నది విశ్లేషకుల మాట

తన గెలుపు నల్లేరుపై నడక అని భావించిన దీదీకి గ్రౌండ్‌ రియాలిటీ తెలిసి రావడంతో.. రాష్ట్రాన్ని అనుచరుల చేతుల్లో పెట్టేసి.. నందిగ్రామ్‌కు మకాం మార్చేశారు. రాష్ట్రంపై కంటే.. నందిగ్రామ్‌పైనే ఎక్కువ ఫోకస్‌ చేశారు. ఇక చివరి మూడు రోజుల ఎన్నికల ప్రచారంతో తన మకాం మొత్తం నందిగ్రామ్‌కు షిఫ్ట్‌ చేశారు దీదీ.. మమత వ్యవహారశైలిని చూస్తే తన గెలుపుకు కావాల్సిన ఏ అవకాశాన్ని కూడా వదులుకునే ఉద్దేశం కనిపించలేదు ఆమెలో.. ప్రచారం చివరి రోజు ఆఖరి సభలో ప్రసంగించిన అనంతరం జాతీయ గీతం ఆలపించే సమయంలో వీల్‌ చైర్‌ నుంచి లేచి నిలపడి తన ప్రచారానికి ముగింపు పలికారు మమతా బెనర్జీ.

ట్రెండింగ్ వార్తలు