Sunita Williams
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమి మీదకు వచ్చే తేదీపై నాసా ఇప్పటికే స్పష్టత ఇచ్చింది. తొమ్మిది నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉంటున్న వారిద్దరు ఈ నెల 19న భూమి మీదకు వస్తారని నాసా తెలిపింది.
ఇందుకుగానూ నాసా, స్పేస్ ఎక్స్ చేపట్టిన క్రూ-9 మిషన్‌ను ఇప్పటికే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపారు. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ క్రూ-9 మిషన్ ద్వారానే తిరిగి భూమి మీదకు రానున్నారు. క్రూ-9 సిబ్బందిని రిలీవ్ చేసేందుకు వెళ్లే క్రూ-10 ప్రయోగం ఈ నెల 12న జరగనుంది.
మైక్రోగ్రావిటీ ఉండే పరిసరాలలో సునీతా విలియమ్స్ తొమ్మిది నెలలుగా ఉంటుండడంతో ఆమెకు ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయి. తాజా నివేదిక ప్రకారం.. సునితా విలియమ్స్ తీవ్రమైన ఎముక సాంద్రత తగ్గింది. అలాగే, కంటి సమస్యలు, శరీరంలో బలహీనతతో ఆమె బాధపడుతున్నట్లు తెలిసింది.
Also Read: తెలంగాణ మహిళలకు గుడ్‌న్యూస్.. రైల్వే స్టేషన్లలో స్టాల్స్.. ఉపాధి పొందొచ్చు..
అంతరిక్షంలో ఉండే మైక్రోగ్రావిటీలో ఎక్కువ కాలం ఉండడం వల్ల శరీరంపై తీవ్రమైన దుష్ప్రభావాలు పడతాయి. తీవ్రమైన శారీరక, మానసిక సమస్యలు ఎదురయ్యే ముప్పు ఉంటుంది. దీన్ని బట్టి నాసా వ్యోమగామి సునితా విలియమ్స్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలపై నిపుణులు పలు వివరాలు చెబుతున్నారు.
సునీతా విలియమ్స్ కండరాల బలహీనతతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మనిషి శరీరం చాలా కాలం పాటు మైక్రోగ్రావిటీకి గురైనప్పుడు కండరాలు బరువును భరించలేవు. దీంతో కండరాల బలహీనతకు ఇది దారితీస్తుంది. కాళ్లు, తొడల వెనుక భాగం వంటి భాగాల్లో ఈ సమస్యలు ఎదురవుతాయి. వ్యోమగాములు చాలా కాలం మైక్రోగ్రావిటీకి గురైనప్పుడు వారి కండర ద్రవ్యరాశిలో 20 శాతం వరకు కోల్పోతారని అధ్యయనాలు చెబుతున్నాయి.
అలాగే, ఇన్ని నెలల పాటు అక్కడ ఉన్నవారిలో ఎముకల సాంద్రత తగ్గుతుంది. దీంతో ఫ్రాక్చర్ల ముప్పు అధికంగా ఉంటుంది. వ్యోమగాములు స్పేస్‌లో నెలకు 1-2 శాతం ఎముకల సాంద్రతను కోల్పోతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే, హృద్రోగ సమస్యలు కూడా రావచ్చు. న్యూరోవెస్టిబ్యులర్ సమస్యలు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. సునీతా విలియమ్స్ కంటి సంబంధించి కూడా తీవ్రమైన సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది.