Telangana Govt: తెలంగాణ మహిళలకు గుడ్‌న్యూస్‌.. రైల్వే స్టేషన్లలో స్టాల్స్.. ఉపాధి పొందొచ్చు..

రైల్వే శాఖ నుంచి కూడా అనుమతి వచ్చింది.

Telangana Govt: తెలంగాణ మహిళలకు గుడ్‌న్యూస్‌.. రైల్వే స్టేషన్లలో స్టాల్స్.. ఉపాధి పొందొచ్చు..

Cm Revanth Reddy

Updated On : March 3, 2025 / 2:05 PM IST

తెలంగాణలోని రైల్వే స్టేషన్లలో పిండి వంటలు అందుబాటులోకి రానున్నాయి. హోం ఫుడ్ లాంటి కమ్మని పిండి వంటల రుచిని ఆస్వాదిస్తూ మీరు ప్రయాణం చేయవచ్చు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకుంటోంది.

ఈ పిండి వంటలను మహిళా స్వయం సహాయ సంఘాలు తయారు చేస్తాయి. రైల్వే స్టేషన్లలో వారి ఉత్పత్తుల స్టాళ్లు ఏర్పాటు అవుతాయి. తొలి దశలో 14 మహిళా స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు.

అనంతరం మరో 36 స్టాళ్లను ఏర్పాటు చేస్తారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు ప్లాన్‌ వేసుకుంది. మహిళా ఉత్పత్తుల స్టాళ్లు ప్రస్తుతం తెలంగాణ సెక్రటేరియట్, కలెక్టరేట్లు, పలు టూరిస్ట్ ప్లేసెస్‌లో ఉన్నాయి.

Also Read: ఈ బాలిక వయసు 8 ఏళ్లు మాత్రమే.. ఎంత టాలెంట్‌ ఉందో చూడండి.. ఆనంద్ మహీంద్ర ఏమన్నారంటే?

రైల్వే స్టేషన్లలో తెలంగాణ చేనేత ఉత్పత్తులు కూడా అందుబాటులోకి రానున్నాయి. రైల్వే స్టేషన్లలో ఈ స్టాళ్ల ఏర్పాటు కోసం తెలంగాణ మంత్రి సీతక్క ఇప్పటికే అధికారులను ఆదేశాలు జారీ చేశారు. అనంతరం, సెర్ప్‌ సీఈవో దివ్యాదేవరాజన్‌ సంబంధిత అధికారులతో చర్చలు జరిపారు.

రైల్వే శాఖ నుంచి కూడా అనుమతి వచ్చింది. పిండి వంటలు, మట్టి కప్పులు, కడాయిలు, నీళ్లసీసాలు, పోచంపల్లి చేనేత ఉత్పత్తుల వంటివి ఆయా రైల్వే స్టేషన్లలో కనపడతాయి. సికింద్రాబాద్‌, ఖమ్మం, సిర్పూర్‌, భద్రాచలం, వరంగల్‌, ఘనాపూర్‌, శంకర్‌పల్లి, వికారాబాద్‌, చర్లపల్లి, జనగామ వంటి రైల్వే స్టేషన్లలో ఆయా ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు.

ఒక్కో రైల్వే స్టేషన్‌లో ఒక్కో రకం ఉత్పత్తులు అందుబాటులోకి రానున్నాయి. ఈ విధానాన్ని మొదలు పెడితే పలు రాష్ట్రాల నుంచి తెలంగాణ మహిళా సంఘాల ఉత్పత్తులకు ఆర్డర్లు రావచ్చని అధికారులు అంటున్నారు.