గత చరిత్రలను గమనంలో గుర్తు చేసుకుంటూ.. జ్ఞాపకంగా మార్చుకుని ఓ రోజును కేటాయించి ఉత్సవంగా సంబరాలు చేసుకుంటాం.. ఈరోజు(23 డిసెంబర్ 2020) కూడా అటువంటి ఓ రోజే. అన్నం పెట్టే అన్నదాతల దినోత్సవం నేడు. జాతీయ రైతు దినోత్సవం(కిసాన్ దివస్). ప్రతి ఏటా డిసెంబర్ 23వ తేదీన రైతు దినోత్సవంగా దేశం జరుపుకుంటుంది. భారతదేశ 5వ ప్రధానమంత్రి, ‘భారతదేశపు రైతుల విజేత’ గా గుర్తింపుపొందిన చౌదరి చరణ్ సింగ్ పుట్టినరోజు సందర్భంగా జాతీయ రైతు దినోత్సవం జరుపుకుంటారు.
చౌదరి చరణ్ సింగ్ చేసిన అనేక ఉద్యమాల వల్ల జమీందారీ చట్టం రద్దై, కౌలుదారీ చట్టం అమలులోకి వచ్చింది. రైతులకు బ్యాంక్ ఋణాలు అందించే విధానము ప్రవేశపెట్టబడింది. రైతుల గురించి, వ్యవసాయరంగం గురించి అంతగా ఆలోచించి, వారి సమస్యల పరిష్కారానికి కృషిచేసిన చరణ్ సింగ్ సేవలకు గుర్తుగా ప్రభుత్వము చరణ్ సింగ్ జన్మదినోత్సవాన్ని జాతీయ రైతు దినోత్సవంగా ప్రకటించింది.
ఈసారి రైతు దినోత్సవం రోజున రైతులు రోడ్లపై కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత 28 రోజులుగా రైతులు నిరంతరం ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే కేంద్రం మాత్రం ఇప్పటివరకు దిగిరాలేదు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంలో మొండిగా కేంద్రం వ్యవహరిస్తుంది. ఈ క్రమంలో నిరసనల మధ్యనే రైతు దినోత్సవం జరుగుతుంది దేశంలో.