దేశవ్యాప్త లాక్ డౌన్ అనివార్యం..మోడీకి 4అత్యవసర సూచనలు చేసిన రాహుల్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి ప్రధాన మంత్రికి లేఖ రాశారు.

Rahul Gandhi కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి ప్రధాన మంత్రికి లేఖ రాశారు. రాహుల్ తన లేఖలో…దేశంలో కోవిడ్ సృష్టిస్తున్న వినాశకర పరిస్థితుల నేపథ్యంలో..ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత ప్రజలే అయి ఉండాలన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం తన సర్వ శక్తులు ఉపయోగించాలన్నారు. అయితే ప్రపంచీకరణ మరియు పరస్పర అనుసంధాన ప్రపంచంలో భారతదేశం యొక్క బాధ్యతను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమన్నారు. ప్రపంచంలోని ప్రతి ఆరుగురిలో ఒకరికి భారత్ నివాసమన్నారు. భారత్‌లో ఉన్న జన్యు వైవిధ్యం,సంక్లిష్టతల కారణంగా ఇక్కడ వైరస్ అత్యంత వేగంగా మ్యుటేట్ అవుతోందని చెప్పారు. తద్వారా అది మరింత ప్రమాదకరంగా మారుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న డబుల్ మ్యుటెంట్,ట్రిపుల్ మ్యుటెంట్ స్ట్రెయిన్స్ కేవలం ఆరంభ దశ మాత్రమేనన్నారు.

వైరస్ వ్యాప్తిని ఇలాగే వదిలేస్తే అది కేవలం మన దేశానికే కాక ప్రపంచానికే వినాశనకర పరిస్థితులను తీసుకొస్తుంద్ననారు. దేశంలో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పరిష్కరించాల్సిన సమస్యలు నాలుగు ఉన్నాయన్నారు. వాటిని పరిష్కరించడం ద్వారా కరోనాను కట్టడి చేయవచ్చునని తెలిపారు. 1. దేశవ్యాప్తంగా వైరస్,మ్యుటేషన్స్ వ్యాప్తిని జీనోమ్ సీక్వెన్స్,డిసీజ్ పాటర్న్స్ నమూనాల ద్వారా శాస్త్రీయంగా గుర్తించాలి. 2. కొత్తగా పుట్టుకొస్తున్న మ్యుటేషన్లపై అన్ని వ్యాక్సిన్లను ప్రయోగించి వాటి సామర్థ్యాన్ని పరీక్షించాలి. 3. దేశ జనాభా మొత్తానికి వేగవంతంగా వ్యాక్సినేషన్ ఇవ్వాలి. 4. కరోనా లెక్కల విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలి.

కేంద్రప్రభుత్వానికి స్పష్టమైన మరియు స్థిరమైన కోవిడ్ మరియు టీకా వ్యూహం లేకపోవడం… భారతదేశాన్ని అత్యంత ప్రమాదకరమైన స్థితిలో ఉంచిందన్నారు. అదేవిధంగా,కోవిడ్ పై పూర్తిస్థాయి విజయం సాధించకుండానే సంబరాలు జరుపుకున్నారని ఫైర్ అయ్యారు. ఓవైపు వైరస్ వ్యాప్తి కొనసాగుతుండగానే కరోనాపై పోరులో విజయం సాధించామని ప్రకటించి అతివిశ్వాసాన్ని ప్రదర్శించడం భారత్‌ను మరింత ప్రమాదంలోకి నెట్టిందన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యం భారత్‌లో మరో లాక్‌డౌన్‌ను అనివార్యం చేసిందన్నారు. దేశంలో లాక్‌డౌన్ విధిస్తే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని… లాక్‌డౌన్ ప్రభావం ఎక్కువగా ఉండే ప్రజల కోసం తగిన ఏర్పాట్లు చేయాలని ప్రధానికి రాహుల్ సూచించారు. లాక్‌డౌన్‌తో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురవుతాయని ప్రభుత్వం భావిస్తోందని… కానీ వైరస్ కారణంగా సంభవిస్తున్న ప్రాణ నష్టాలను ఇలాగే వదిలిస్తే భవిష్యత్తులో మరింత విషాదకర పరిస్థితులు తప్పవని అన్నారు. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు అన్ని వర్గాలను కలుపుకుని ముందుకెళ్లాలని… ఇందుకు కాంగ్రెస్ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ అత్యవసర సలహాలు సూచనలను పరిగణలోకి తీసుకోవాలని రాహుల్ తన లేఖలో మోడీకి విజ్ఞప్తి చేశారు. కాగా, దేశంలో సెకండ్ వేవ్ కరోనా సమయంలో ప్రధానికి రాహుల్ రాసిన లేఖ ఇది.

ట్రెండింగ్ వార్తలు