కార్మిక విధానాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్త సమ్మె

  • Publish Date - November 26, 2020 / 08:10 AM IST

Nationwide strike against labor policies : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక విధానాలకు వ్యతిరేకంగా నేడు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు సమ్మెకు దిగుతున్నాయి. బ్యాంకింగ్‌, రక్షణ, రైల్వేలతో పాటు వివిధ రంగాలకు చెందిన దాదాపు 25 కోట్ల మంది కార్మికులు, ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొననున్నారు. సులభతర వాణిజ్యం పేరుతో ప్రభుత్వం కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతోందని INTUC, AITUC సహా పది కార్మిక సంఘాలు ఆరోపించాయి. సమ్మెను విజయవంతం చేయడానికి కార్మికులంతా కలిసి రావాలని యూనియన్ నేతలు పిలుపునిచ్చారు.



ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల ఉద్యోగులే కాకుండా.. ఇతర పరిశ్రమల కార్మికులు, భవన నిర్మాణ, బీడీ కార్మికులు, హామాలీలు, చిరు వ్యాపారులు, రైతు కూలీలు అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొంటారని కార్మిక సంఘాలు తెలిపాయి. పలు కీలక డిమాండ్‌లు నెరవేర్చాలంటూ కార్మిక సంఘాలు సమ్మెకు వెళుతున్నాయి. పన్ను కట్టని ప్రతి కుటుంబానికి నెలకు 7 వేల 500 రూపాయల నగదు, కుటుంబంలోని ప్రతి వ్యక్తికి నెలకు 10 కేజీల రేషన్‌ను అందించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో అమలవుతున్న ఉపాధీ హామీ పథకాన్ని 200 రోజులకు పెంచడమే కాకుండా.. వేతనాన్ని కూడా పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి.



https://10tv.in/dialling-mobile-number-with-zero-prefix-to-be-mandatory-soon-as-dot-accepts-trai-proposal/
కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా రూపొందించిన చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌ పరం చేయడానికి కూడా ఆపేయాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ముఖ్యంగా రైల్వే, ఆయుధ కార్మాగారాలను కార్పొరేట్‌ పరం చేయడాన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు సమ్మెలో తాము పాల్గొనడం లేదని బీజేపీ అనుబంధ సంస్థ అయిన భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ ప్రకటించింది. ఇది పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో చేపడుతున్న సమ్మె అని బీఎంసీ ఒక ప్రకటనలో తెలిపింది.