Sidhu (1)
Lakhimpur Violence లఖింపుర్ ఖేరి వెళ్లకుండా పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూను పోలీసులు నిర్బంధించారు. లఖింపూర్ ఖేరీ జిల్లాలో రైతులను కార్లతో తొక్కించిన ఘటనపై బీజేపీకి వ్యతిరేకంగా పంజాబ్‌లోని మొహాలీ నుంచి యూపీలోని లఖింపూర్ ఖేరీకి గురువారం చేపట్టిన భారీ కాంగ్రెస్ ర్యాలీకి సిద్ధూ నేతృత్వం వహించారు. లఖింపుర్ ఖేరికి మార్చ్ చేపట్టిన ఆయన నేతృత్వంలోని బృందాన్ని యమునా నగర్(హర్యానా)-సహరాన్‌పూర్(ఉత్తర్ప్రదేశ్)బోర్డర్ లో పోలీసులు అడ్డగించారు.
ఈ సందర్భంగా సిద్ధూ యూపీ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రైతుల హత్యకు కారణమైన కేంద్ర మంత్రి కుమారుడిపై ఎలాంటి చర్యలు తీసుకోని పోలీసులు బాధిత రైతు కుటుంబాల బాధను పంచుకునేందుకు వెళ్తున్న తమను అడ్డుకోవడంపై మండిపడ్డారు. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడ్ని శుక్రవారంలోగా అరెస్ట్ చేయకపోతే తాను నిరాహార దీక్షకు దిగుతానని సిద్ధూ హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో సిద్ధూ సహా పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు అందరూ కలిపి దాదాపు 150 మందిని సహరాన్‌పూర్ పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. సిద్ధూ వెంట పలువురు పంజాబ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఉన్నారు. వీరందరినీ సర్సావా పోలీస్ స్టేషన్లో ఉంచారు.
కాగా,అక్టోబర్ 3న లఖింపూర్ ఖేరి జిల్లాలో రైతులు నిరసన చేస్తుండగా.. కేంద్ర మంత్రి కాన్వాయ్ వారిపైకి దూసుకెళ్లిప ఘటనలో నలుగురు చనిపోగా… అనంతరం జరిగిన ఘర్షణలో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
ALSO READ Lakhimpur Kheri Violence : ఇద్దరు బీజేపీ కార్యకర్తలు అరెస్ట్..కేంద్రమంత్రి కుమారుడికి సమన్లు