×
Ad

Nayab Singh Saini: హరియాణా సీఎంగా నయబ్ సింగ్ సైనీ రేపు ప్రమాణ స్వీకారం.. మోదీ, చంద్రబాబుసహా హాజరుకానున్న ప్రముఖులు

హరియాణా సీఎంగా నయబ్ సింగ్ సైనీ మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. బుధవారం హరియాణా బీజేపీ శాసనసభా పక్ష భేటీ జరిగింది.

Haryana CM Nayab Singh Saini

Haryana CM Nayab Singh Saini: హరియాణా సీఎంగా నయబ్ సింగ్ సైనీ మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. బుధవారం హరియాణా బీజేపీ శాసనసభా పక్ష భేటీ జరిగింది. ఈ కార్యక్రమానికి పార్టీ పరిశీలకులుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ హాజరయ్యారు. మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, సీనియర్ నేత అనిల్ విజ్ లు సమావేశంలో నయబ్ సింగ్ సైనీ పేరును ప్రతిపాదించగా.. సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. కొత్త సీఎంగా ఎన్నికైన సైనీకి అమిత్ షా, బీజేపీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. గురువారం ఆయన హరియాణా సీఎంగా మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Also Read: Chennai Rain: చెన్నైలో భారీ వర్షాలు.. రజనీకాంత్ ఇంటి చుట్టూ భారీగా చేరిన వరదనీరు.. వీడియో వైరల్

మనోహర్ లాల్ ఖట్టర్ స్థానంలో హరియాణా సీఎంగా సైనీ ఈ ఏడాది మార్చిలో బాధ్యతలు స్వీకరించారు. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హరియాణాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. బీజేపీ 48 స్థానాల్లో విజయం సాధించగా.. కాంగ్రెస్ పార్టీ 37 స్థానాలకే పరిమితమైన విషయం తెలిసిందే. దీంతో వరుసగా మూడోసారి బీజేపీ హరియాణాలో అధికారాన్ని చేపట్టేందుకు కావాల్సిన స్థానాలను గెలుచుకుంది. అయితే, సీఎం పదవిపై పలువురు పేర్లను బీజేపీ అధిష్టానం పరిశీలించగా.. చివరకు నయాబ్ సింగ్ సైనీనే సీఎంగా పదవిలో కూర్చొబెట్టేందుకు నిర్ణయించారు. రేపు జరిగే నయాబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ తోపాటు, ఏపీ సీఎం చంద్రబాబు నాయడు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు.