మహారాష్ట్ర ఎపిసోడ్‌లో ప్రతి పార్టీ ఎంతో కొంత సైద్ధాంతికంగా నష్టపోయింది. ఎక్కువగా పరువు పోగొట్టుకుంది మాత్రం… రాష్ట్రపతి, గవర్నరే. వచ్చిన అవకాశాన్ని ప్రతి పార్టీ పకడ్బందీగా చేజిక్కించుకుంటుందని అనుకోలేం. అర్ధరాత్రి విధ్వంసకర రాజకీయాల్లో ఆరితేరిన బీజేపీ కూడా, చాణిక్యుడనిపించుకున్న అమిత్ షా కూడా… సరైన మిత్రుడ్ని ఎంచుకోలేక మూడు రోజుల్లో ఉసూరుమనిపించారు.
ముఖ్యమంత్రి పదవిని తనతో పంచుకోవాల్సిందేనని మొండిపట్టుపట్టిన శివసేననను కాదని ఎన్సీపీని చీల్చి సొంతంగా వెళ్లాలనుకుంది బీజేపీ. బీజేపీ రాజకీయ విజయాల జాబితాలో మహారాష్ట్ర కూడా చేరిపోయిందని అనిపించింది. ఎన్సీపీ, శివసేనలు ముక్కచెక్కలైపోయాయా అనిపించాయి. దీనికితోడు బీజేపీ కూడా రాజ్యాంగ వ్యవస్థల స్వతంత్రతను దెబ్బతీస్తూ… చేతిలో కీలుబొమ్మలా మార్చుకున్న గవర్నర్ మొదలు రాష్ట్రపతి వరకు అందరూ… మహారాష్ట్రలో అధికారం బీజేపీకి కట్టబెట్టేందుకు ప్రయత్నించారు.
ఇంకో మాట. అవినీతికి మేం వ్యతిరేకమని బీజేపీ ప్రచారం చేసుకుంటోంది. ఫడ్నవీస్ ప్రభుత్వ హయాంలోనే కేసులున్న ఎన్సీపీతో అధికారాల పంపకం గురించి కమలం చర్చించడమంటేనే నిజానికి పెద్ద షాక్. రూ.70వేల కోట్ల ఇరిగేషన్ స్కామ్‌లో నిందితుడైన అజిత్ పవార్‌ని డిఫ్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించడంలో మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్‍కు ఇబ్బంది లేదు. నిజానికి, ప్రమాణస్వీకార వేదికపై అజిత్ పవార్‌తో ఫడ్నవీస్‌ను చూసిన బీజేపీ అభిమానులకు కళ్లు తిరిగాయి. అధికారం ఒక్కటే పరమావధి కాదు కదా. ఎన్సీసీ చీఫ్ శరద్ పవార్ మీద మహారాష్ట్ర కో-ఆపరేటీవ్ బ్యాంక్ స్కామ్ కేసులున్నాయి.
ఎయిర్ ఇండియా డీల్‌లో చేతులు తడిచాయని ప్రఫూల్ పటేల్ మీద కేసుంది. అయినా అదే ఎన్సీపీని చీల్చి అధికారమెక్కాలని బీజేపీ తాపత్రయపడింది. నిజానికి అజిత్ బీజేపీ పంచన చేరడం శరద్ పవార్ వ్యూహమేనని ప్రచారం నడిచింది. తాను మాత్రం పార్టీ చీలికను శదర్ పవార్ ఒప్పుకోలేదన్నారు. అజిత్ పవార్ ఇలా ప్రమాణ స్వీకారం చేయగానే ఆయన మీదున్న కేసుల్లో తొమ్మిందిటిని మహారాష్ట్ర అవినీతి నిరోధక శాఖ మూసివేసిందన్న సంగతి బైటకొచ్చింది. అల్లకల్లోలం రేపింది. క్లోజ్ చేసిన కేసులకు అజిత్ పవార్‌కు ఎలాంటి సంబంధం లేదని ఏసీబీ చెప్పేసరికే… అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది.
ఎన్సీపీతో శివసేన ప్రభుత్వ ఏర్పాటు గురించి చర్చిస్తున్నప్పుడు… కాంగ్రెస్ తన విధానాలకు విరుద్ధంగా అవకాశవాదాన్ని చూపించింది. పి.ఎస్.యు.( పవార్, సోనియా, ఉద్ధవ్)లు ప్రభుత్వ ఏర్పాటు గురించి గవర్నర్‌ను కలవడానికి సిద్ధమవుతున్నరని ఒకవైపు మీడియా చెబుతూనే ఉంది. ఈ సంగతి గవర్నర్‌కు సైతం తెలిసే ఉంటుంది. అయినా…. అజిత్ పవార్ ఎలా పార్టీ మద్ధతును బీజేపీకి ఇవ్వగలరో గవర్నర్ కోషియారి ఆలోచించలేకపోయారు. శాసన సభా పక్షనేతగా సాంతికేతికంగా ఆయనకు అవకాశమున్నా… ఎన్సీపీ విధానం ఆయనకు తెలుసు. తన పార్టీకి మేలు చేయాలన్న తాపత్రయంలో మొత్తం రాజ్యాంగ వ్యవస్థను ఇబ్బంది పెట్టారు. బీజేపీ ఆయన్ను అలా వాడుకుంది.
శనివారం ఉదయం 5.47 నిమిషాలకు మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనను ఎత్తివేసిన రాష్ట్రపతి కోవింద్ ప్రతిష్ట బాగా దెబ్బతింది. రాష్ట్రపతి పాలనను ఎత్తివేయాలని కేబినేట్ కోరలేదు. ప్రధాని మోదీ రూల్ నెం 12ను వాడారు. ఫలితంగా ఫడ్నవీస్, అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడిప్పుడే బైటకొస్తున్న సంగతలును బట్టి చూస్తే… రహస్య రాజకీయ డ్రామాకు కర్త గవర్నర్ కాకపోవచ్చు. సీఎం పదవికి రాజీనామా చేయడానికి ముందు ఫడ్నవీస్ పార్టీలను చేర్చడంపై బీజేపీకి నమ్మకం లేదన్నారు. పోనీ అదే నిజమనుకుంది. మరి అజిత్ పవార్ చేసింది ఏంటి? శివసేన కోరిక తీరబోతోంది.
ఉద్ధవ్ ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఇప్పుడు కూటమిలో సైద్ధాంతిక వైరుధ్యాల గురించి స్పష్టత వస్తోంది. బీజేపీ ఇప్పటికిప్పుడు ఒకడుగువేసినట్లు అనిపిస్తున్నా.. గాయపడినట్లు కనిపిస్తున్నా… సమయం కోసం ఎదురుచూస్తోంది. ఈలోగా ఎన్నికల ముందు పొత్తులు, వాగ్ధానాలన్నీ అధికార యావలో కొట్టుకుపోతున్న సంగతిని వోటర్ గమనిస్తూనే ఉన్నాడు. మరి ఇలాంటి అడ్డదిడ్డంగా పొత్తులు కుదుర్చుకోవడాన్ని అడ్డుకొనేలా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్‌ను సరిదిద్దాల్సిన అవసరం కనిపిస్తూనే ఉంది.