మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్

ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ కే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం పదవి దక్కినట్లు సమాచారం. డిసెంబర్-30,2019న మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ జరిగే అవకాశమున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా అదేరోజు ప్రమాణస్వీకారం చేయబోతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

కాగా ఎన్సీపీ చీప్ శరద్ పవార్ సోదరుడి కుమారుడైన అజిత్ పవార్ గత నెలలో రాత్రికి రాత్రి బీజేపీతో చేతులు కలిపి ఉదయానికల్లా డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. దేశరాజకీయాలను ఈ ఘటన కుదిపేసింది. రాజకీయాల్లో ఏదైనా జరుగవచ్చు అని అజిత్ ఉదంతం అందరికి అర్థమయ్యేలా చేసింది. అయితే ఎన్సీపీ నాయకుడు శరద్ పవార్ అజిత్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. తాము బీజేపీకి ఎట్టిపరిస్థితుల్లోనే మద్దతివ్వబోమని తేల్చిచెప్పిన అనంతరం చేసేదేమీ లేక అజిత్ తన డిప్యూటీ సీఎం పదవికి కొన్ని గంటల్లోనే రాజీనామా చేశారు.

అజిత్ రాజీనామా చేసిన కొద్దిసేపటికి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా సీఎం పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలో శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ మహావికాస్ అఘాడి పేరుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఆ తర్వాత అజిత్ బీజేపీకి బైబై చెప్పి తిరిగి సొంతగూటికి చేరుకున్న విషయం తెలసిందే.