వన్ ఇయర్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) విధానాన్ని తిరిగి పునరుద్ధరించాలన్న విషయంపై జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) చర్చించింది. తాజాగా, ఎన్‌సీటీఈ పాలకమండలి సమావేశం జరిగింది.
అనంతరం దీనిపై ఒక ప్రకటన చేస్తూ.. మళ్లీ వన్ ఇయర్ బీఈడీ కోర్సును ప్రవేశపెట్టే అవకాశాలు తెలిపింది. దశాబ్దకాలం క్రితం వన్ ఇయర్ బీఈడీ విధానం అమలులో ఉండేది. ఇప్పుడు దీన్ని పునరుద్ధరిస్తే నాలుగేళ్ల యూజీ లేదంటే రెండేళ్ల పీజీ పూర్తి చేసిన విద్యార్థులకు వన్ ఇయర్ ఈ కోర్సు విధానం వర్తిస్తుంది.
మూడేళ్ల యూజీ పూర్తి చేసిన వారికి ఇది వర్తించదు. మూడేళ్ల యూజీ కోర్సు చదివిన వారు రెండేళ్ల బీఈడీ ప్రోగ్రామ్ చదవాల్సి ఉంటుంది. అలాగే, రెండేళ్ల బీఈడీని అందించే సంస్థలు 2028 ఏడాదిలోపు మల్టీడిసిప్లినరీ ఇన్‌స్టిట్యూట్‌లుగా మారాలని ఎన్‌సీటీఈ చైర్మన్ పంకజ్ అరోరా అన్నారు. కొన్ని నిర్ణయాలపై కేంద్ర విద్యాశాఖతో చర్చిస్తున్నామని చెప్పారు.
ఎన్‌సీటీఈ రూల్స్-2025 పేరుతో ముసాయిదాను ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు. వన్ ఇయర్ బీఈడీతో పాటు పలు కోర్సుల ఫ్రేమ్‌వర్క్ కోసం ఎనిమిది మంది సభ్యుల ప్యానెల్‌ను కూడా ఏర్పాటు చేశారు. స్కూళ్లలో విద్యా నాణ్యతా ప్రమాణాలు పెంచాలన్న ఉద్దేశంతో 2014 డిసెంబర్‌లో వన్ ఇయర్ బీఈడీ కోర్సును నిలిపివేశారు. తదుపరి ఏడాది నుంచి రెండేళ్ల బీఈడీ కోర్సును ప్రవేశపెట్టారు.
Grama Sabalu: తెలంగాణలో తొలిరోజు గ్రామసభల్లో కొత్తగా 47,413 దరఖాస్తులు