NEET controversy: మరోసారి దేశాన్ని కుదిపేస్తున్న నీట్ ఇష్యూ

పరీక్ష నిర్వహణలో ఇన్విజిలేటర్ల తప్పిదం, నిర్లక్ష్యం కారణంగా అభ్యర్థులకు జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు గ్రేస్ మార్కులు కలిపారు.

అడ్డగోలు ర్యాంకులు, చెప్పలేనన్ని కాంట్రవర్సీలు.. మొదటి నుంచి నీట్ యూజీ పరీక్ష వ్యవహారం ఇలాగే కొనసాగుతోంది. ఈ ఇయర్ కూడా నీట్ యూజీ పరీక్ష వివాదం దేశాన్ని కుదిపేస్తుంది. MBBSతో పాటు ఇతర వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన నీట్‌ పరీక్షపై దుమారం కంటిన్యూ అవుతోంది.

నీట్‌ యూజీ క్వశ్చన్ పేపర్ లీక్‌తో పాటు మాల్ ప్రాక్టీస్, రిగ్గింగ్ జరిగిందంటూ అభ్యర్థులు, అపోజిషన్ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గ్రేస్ మార్కుల కేటాయింపుల వ్యవహారంలోనూ పెద్దఎత్తున డబ్బులు చేతులు మారాయని.. తిరిగి మళ్లీ ఎగ్జామ్ నిర్వహించాలంటూ రోడ్డెక్కుతున్నారు అభ్యర్థులు. నార్త్ స్టేట్స్‌లోని వివిధ రాష్ట్రాల్లో నీట్ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు న్యాయం చేయాలంటూ ఆందోళనలు చేస్తున్నారు.

23.33 లక్షల మంది పరీక్షకు హాజరు
మే 5న నీట్ పరీక్ష జరిగింది. పరీక్షకు దాదాపు 24 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 23.33 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. నీట్ రిజల్ట్‌ను జూన్ 14న ప్రకటించాల్సి ఉండగా, అంతకంటే 10 రోజుల ముందే జూన్ 4న ప్రకటించారు. ఇదే మొదటగా అనుమానాలకు తావిచ్చింది. 67 మంది టాప్ స్కోర్ సాధించారు, అంటే 720కి 720 మార్కులు వచ్చాయి. ఇంతమంది టాప్ స్కోర్ సాధించడం ఇదే మొదటిసారి. ఇది కూడా నీట్ పరీక్షపై అనుమానాలు పెంచడానికి కారణమైంది. 2023లో ఇద్దరికి మాత్రమే 720కి 720 మార్కులు వచ్చాయి. 2022లో ఎవరూ పూర్తి మార్కులు సాధించలేదు.

ఈసారి టాప్ స్కోర్ సాధించిన 67 మందిలో ఆరుగురు విద్యార్థులు హరియానాలోని ఒకే ఎగ్జామ్ సెంటర్‌లో పరీక్షలు రాశారు. ఆ తర్వాత 2 ర్యాంకులు కూడా అదే పరీక్ష కేంద్రంలో పరీక్ష రాసిన విద్యార్థులకే వచ్చాయి. ఇది ఎలా సాధ్యమని నిపుణులు, నీట్ అభ్యర్థులు, అపోజిషన్ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి.

కొందరు విద్యార్థులకు 720 మార్కులకుగాను 718, 719 మార్కులు వచ్చాయి. నిజానికి అది సాధ్యం కాదు. ఒక్కో జవాబుకు 4 మార్కులు ఉంటాయి, ఒకవేళ అది తప్పు సమాధానం అయితే ఒక నెగెటివ్ మార్కు ఉంటుంది. అలాంటప్పుడు, ఒక విద్యార్థి అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి, ఒక్క ప్రశ్నకు తప్పుడు జవాబు రాసినా అతనికి 715 మార్కులు మాత్రమే వస్తాయి.

ఒకే సెంటర్‌లో ఎక్కువ మందికి టాప్ ర్యాంకులు
ఒకే సెంటర్‌లో ఎక్కువ మందికి టాప్ ర్యాంకులు రావడంతో.. నీట్ పేపర్‌ లీక్ అనుమానాలు ఎక్కువ అవుతున్నాయి. ఇప్పటికే బిహార్‌లో ఇదే విషయమై FIR నమోదు చేసి 13 మందిని అరెస్టు చేశారు. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు బిహార్ పోలీసు శాఖలోని ఎకనమిక్ అఫెన్సెస్ యూనిట్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈసారి పరీక్షలో విద్యార్థులు భారీగా మార్కులు సాధించడంతో, అర్హత సాధించాల్సిన స్కోర్ కూడా ఎక్కువగానే ఉండటంతో పూర్తిస్థాయి దర్యాప్తు జరగాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు నీట్ అభ్యర్థులు.

గ్రేస్ మార్కుల వివాదం మరింత రచ్చకు దారి తీస్తోంది. 67మందికి టాప్ ర్యాంకులు వస్తే అందులో 50మంది గ్రేస్‌ మార్కుల వల్లే ఫస్ట్ ర్యాంకు సాధించారు. అంటే దీనికి వెనక ఏదో వ్యవహారం జరిగిందన్న చర్చ, అనుమానాలు బలపడుతున్నాయి. ఒకే సెంటర్‌లో ఎగ్జామ్‌ రాసిన ఆరుగురికి టాప్ ర్యాంకులు రావడం..గ్రేస్ మార్కులు కలిపినవారే టాప్‌లో నిలవడంతో..ఈ ఏడాది నీట్ పేపర్ లీక్ అయిందని, మాల్ ప్రాక్టీస్ కూడా జరిగిందని ఆరోపిస్తున్నారు ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు.

గ్రేస్ మార్కులు ఎందుకు కలిపారు?
అసలు గ్రేస్ మార్కులు ఎందుకు కలిపిరాన్నది పెద్ద చర్చ. దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ రాసిన 24లక్షల మందిలో కేవలం 15వందల 63మందికి గ్రేస్ మార్కులు కలపడం వెనక పెద్దతతంగమే జరిగిందన్న ఆరోపణలున్నాయి. కొన్ని కోచింగ్ ఇనిస్టిట్యూట్స్, పెద్ద తలకాయలు వెనకుండి ఈ వ్యవహారాన్ని నడిపించారని చర్చ జరుగుతోంది. అయితే నీట్ పరీక్ష నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మాత్రం సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారమే గ్రేస్ మార్కులు కలిపామని చెప్తోంది.

పరీక్ష నిర్వహణలో ఇన్విజిలేటర్ల తప్పిదం, నిర్లక్ష్యం కారణంగా అభ్యర్థులకు జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు గ్రేస్ మార్కులు కలిపారు. మేఘాలయా, హరియానా, ఛత్తీస్‌గఢ్, సూరత్, చండీగఢ్‌లోని మొత్తం ఆరు ఎగ్జామ్‌ సెంటర్లలో ఓఎంఆర్‌ షీట్లు చినిపోవడం, ఒక పేపర్‌కు బదులు మరో పేపర్‌ ఇవ్వడం, పరీక్ష నిర్వహణలో లేట్‌ అవడం వంటి కారణాలతో 1,563 మంది అభ్యర్థులకు నష్టపరిహారం కింద గ్రేసు మార్కులు ఇచ్చారు. గ్రేస్ మార్కులు యాడ్ చేసినవారికి టాప్ ర్యాంకులు రావడం వివాదానికి మరో కారణం అవుతోంది.

అటు ఇటు తిరిగి నీట్ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. పలువురు అభ్యర్థులు, అపోజిషన్ పార్టీలకు చెందిన నేతలు.. కేసులు వేయడంతో ఇష్యూ హాట్ టాపిక్‌గా మారి నేషనల్ ఇష్యూగా మారింది. ఇప్పటికే పలు కేసులను విచారించిన సుప్రీంకోర్టు 1,563 మందికి కేటాయించిన గ్రేస్ మార్కులను రద్దు చేసింది. దీంతో వివాదం కొత్త టర్న్ తీసుకుంది.

KTR: కేంద్ర ప్రభుత్వానికి మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు లేఖ

ట్రెండింగ్ వార్తలు