వారణాసిలో నేపాలీకి గుండు కొట్టించి, జైశ్రీరామ్ అనాలని బలవంతం

  • Publish Date - July 18, 2020 / 09:06 AM IST

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో దారుణం జరిగింది. కొందరు వ్యక్తులు ఓ నేపాలీని పట్టుకున్నారు. అతడికి గుండు కొట్టించారు. ఆ తర్వాత జైశ్రీరామ్ అనాలని అతడిని బలవంతం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాముడు నేపాల్ లో జన్మించాడు, రాముడు మా వాడు, నిజమైన అయోధ్య ఖాట్మాండులో ఉంది అంటూ నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. నేపాల్ ప్రధానిపై భారత్ లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆయన అలా అన్ని కొన్ని రోజులకు వారణాసిలో ఈ ఘటన జరిగింది.

నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు:
ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. వెంటనే రంగంలోకి దిగారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో పాల్గొన్న ఇతర వ్యక్తులను కూడా గుర్తించామని పోలీసులు తెలిపారు. అందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అరుణ్ పాఠక్ అనే వ్యక్తి ఈ వీడియో షేర్ చేశాడని, అందులో ఉన్న వారంతా అతడి స్నేహితులు అని వారణాసి పోలీస్ చీఫ్ అమిత్ పాఠక్ తెలిపారు.

సీఎం యోగి దృష్టికి తీసుకెళ్లిన నేపాల్ రాయబారి:
ఈ ఘటనను నేపాల్ రాయబారి నీలాంబర్ ఆచార్య తీవ్రంగా ఖండించారు. దీన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దృష్టికి తీసుకెళ్లారు. సీఎంతో దీని గురించి మాట్లాడారు. ఈ ఘటనపై నీలాంబర్ ఆవేదన వ్యక్తం చేశారు. యూపీలో నివాసం ఉంటున్న నేపాలీల భద్రతపై సందేహాలు వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని యూపీ సీఎం యోగి ఆయనకు హామీ ఇచ్చారు. నేపాలీల భద్రత గురించి భయపడాల్సిన పని లేదన్నారు.

రాముడు భారతీయుడు కాదు నేపాలీ:
హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడు భార‌తీయుడు కాదు, నేపాలీ.. ఆయ‌న పుట్టింది భార‌త్‌లో కానేకాదు.. నేపాల్‌లోనే అంటూ నేపాల్ ప్ర‌ధాని కేపీ శ‌ర్మ ఓలీ వింత‌వాద‌న తెర‌పైకి తెచ్చారు. కొన్ని రోజుల క్రితం ఆయనీ వ్యాఖ్యలు చేశారు. భార‌త భూభాగాలైన‌ లిపూలేఖ్, కాలాపానీ ప్రాంతాల‌ను నేపాల్ మ్యాప్‌లో పొందుప‌రుస్తూ రాజ్యాంగ స‌వ‌ర‌ణ చేసి రెండు దేశాల మ‌ధ్య అగ్గిరాజేసిన ఓలీ, ఇప్పుడు రాముడు మా వాడు అంటూ మరో వివాదానికి తెరలేపారు. భారత్, ఇన్నాళ్లుగా నేపాల్‌ను సాంస్కృతిక దోపిడీ చేస్తూ వ‌చ్చింద‌ని ఆరోపించారాయ‌న‌. ఇంత కాలం పాటు సీతమ్మ‌ను భార‌తీయుడైన రాముడికి ఇచ్చామ‌ని అనుకుంటూ వ‌చ్చామ‌ని, కానీ చ‌రిత్ర‌లోని వాస్త‌వాలు బ‌య‌ట‌కు రావాల్సి ఉంద‌ని, రాముడు కూడా నేపాలీనేని అన్నారు. శ్రీరామ జ‌న్మ‌భూమిగా చెప్పే నిజ‌మైన‌ అయోధ్య నేపాల్‌లోని బిర్గంజ్ ప్రాంతంలో ఉంద‌ని చెప్పారు. భార‌త్‌లోని అయోధ్య కృత్రిమంగా క్రియేట్ చేసింద‌ని ఆరోపించారు ఓలీ. రామాయ‌ణాన్ని సంస్కృతం నుంచి నేపాలీ భాష‌లోకి అనువ‌దించిన నేపాల్ క‌వి భానుభ‌క్తాచార్య 206వ జ‌యంతి సంద‌ర్భంగా జూలై 13న జరిగిన కార్య‌క్ర‌మంలో నేపాల్ ప్ర‌ధాని ఓలీ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

నేపాల్ ప్రధాని వ్యాఖ్యల వెనుక చైనా?
ఓలీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. భారతీయులు నేపాల్ ప్రధానిపై భగ్గుమన్నారు. చైనాతో చేతులు కలిపిన నేపాల్ ప్రధాని భారత్ కు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని, నోటికొచ్చినట్టు కారు కూతలు కూస్తున్నారని మండిపడ్డారు. ఓలీ వ్యాఖ్యలుకు భారత్ లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. భారత సాంస్కృతిక వారసత్వం ఏంటన్నది ప్రపంచానికి తెలుసని.. ఓలీ మాటలను ప్రపంచం అంగీకరించదని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ అన్నారు. ఓలీ వ్యాఖ్యలను ఆ దేశ విదేశాంగశాఖ ఓ క్లారిటీ ఇచ్చిందని.. దీనిపై అంతకంటే ఎక్కువ మాట్లాడలేనని ఆయన చెప్పారు. పురాణాల ప్రకారం సరయు నది ఒడ్డున ఉన్న అయోధ్యలో రాముడు పుట్టడాని శివసేన స్పందించింది. సరయు పేరుతో అసలు నేపాల్ లో నది లేదని తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు