ఈ రోడ్డు పక్క లైబ్రరీ జనాలకు బాగా నచ్చేసింది. మీరూ ట్రై చేయొచ్చు!

  • Publish Date - February 24, 2020 / 12:22 PM IST

టెక్నాలజీ పెరిగిపోయి ప్రపంచం అరచేతిలో ఇమిడిపోయి స్మార్ట్ ఫోన్ లోనే అన్నీ లభ్యమవుతున్న ఈ రోజుల్లో ఈశాన్య రాష్ట్రం మిజోరం రాజధాని ఐజ్వాల్ లో ఏర్పాటు చేసిన రోడ్డు పక్క లైబ్రరీ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పాత చొక్కా అయినా తొడుక్కో… కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో’ అన్నారు కందుకూరి వీరేశలింగం పంతులు. ఈ కామెంట్ పాతదే అయినా నిత్య అన్వయమైన అంశం. వ్యక్తి తనను తాను అర్థం చేసుకోవడానికే కాదు… ప్రపంచాన్ని చూసే దృష్టి మార్చడానికి… ఉపయోగపడే గొప్ప సాధనం పుస్తకం. అందుకే నేమో ఐజ్వాల్ లో రోడ్డుపక్కన ఒక లైబ్రరీని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

రోడ్ సైడ్ లైబ్రరీ గురించి IFS అధికారి పర్వీన్ కస్వాన్ తన ట్విట్టర్ లో  పోస్టు చేశారు. ఇప్పుడు దేశం మొత్తం  మిజోరంను కాపీ కొట్టేపరిస్ధితి వచ్చిందని ఆయన తన ట్వీట్ లో పేర్కోన్నారు. ఈ లైబ్రరీ ఇప్పుడ ప్రజల్లో చదివే ఆసక్తిని పెంచుతోంది. ఇక్కడ ఉన్న పుస్తకాలను కూర్చుని చదువుకునే అవకాశం ఉంది. మనకు ఇక్కడ ఏదైనా పుస్తకం అవసరం అయితే అది తీసుకుని….మన దగ్గర ఉన్నఅక్కర్లేని మరోక పుస్తకాన్ని ఈ లైబ్రరీలో ఉంచవచ్చు. తద్వారా పుస్తకాల మార్పిడికీ ఈ లైబ్రరీ నాంది పలికింది. 

లైబ్రరీ ద్వారా విజ్ఞానం పెంచుకోవటమే కాక  ఆరోగ్యవంతమైన సమాజాన్నికూడా నిర్నించవచ్చని ఆయన ట్వీట్ చేశారు.  దేశ నిర్మాణానికి గ్రంధాలయాలు ఉత్తమ పెట్టుబడి… ఇప్పుడు ఈశాన్య రాష్ట్రం అందుకు మార్గం చూపించిందన్నారు.  దీని స్ఫూర్తితో ఇతర రాష్ట్రాలలోనూ వీధి లైబ్రరీలు ఏర్పాటవుతాయనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. 

వీధి లైబ్రరీ ఏర్పాటు చేయటాన్ని సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ ప్రశంసించారు. ట్విట్టర్ లో లైబ్రరీ గురించి తమకున్న అనుభవాలను అక్కడ పోస్ట్ చేశారు. నేను చిన్నప్పుడు పుస్తకాలు చదవలేకపోయాను. ఇప్పుడు లైబ్రరీకి వెళ్లి చిన్న పిల్లల  పుస్తకాలు తీసుకుని చదవటానికి ఆసక్తి చూపిస్తుంటానని ఒక నెటిజన్ తెలిపాడు. గడిచిన 4 సంవత్సరాల్లో  100 వరకు చిన్న పిల్లల పుస్తకాలు  చదివి ఆనందించానని ఆ నెటిజన్ చెప్పాడు.