New Jobs
New Jobs : ప్రపంచ వ్యాప్తంగా లేఆఫ్స్ పర్వం కొనసాగుతోంది. ఆర్థిక అస్థిరతతో గ్లోబల్ మార్కెట్లలో ఒత్తిడి, లాభాల క్షీణత, ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వినియోగం పెరగడం వెరసి కంపెనీలు ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో పెద్దెత్తున ఉద్యోగులను తొలిగిస్తున్నాయి. ఇలాంటి సమయంలో నిరుద్యోగులకు వర్క్‌ఫోర్స్ సొల్యూషన్స్ ప్రొవైడర్ అడెక్కో నివేదిక గుడ్‌న్యూస్ చెప్పింది. (New Jobs)
దేశీయ బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్ఎస్ఐ) రంగంలో 2030 నాటికి కొత్తగా 2.5లక్షల శాశ్వత ఉద్యోగాలు లభిస్తాయని వర్క్‌ఫోర్స్ సొల్యూషన్స్ ప్రొవైడర్ అడెక్కో నివేదిక పేర్కొంది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం (2025-26)లో 8.7శాతం వృద్ధి నమోదయ్యే అవకాశం ఉండగా.. 2030కి 10శాతానికి చేరొచ్చని పేర్కొంది.
దేశీయ బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా రంగంలో నైపుణ్య గిరాకీకి భారతదేశం శక్తివంతమైన ఇంజిన్‌గా అబివృద్ధి చెందుతోంది. సుమారు 48శాతం కొత్త ఉద్యోగాలు.. రెండో, మూడో అంచె నగరాల నుంచే కనిపిస్తున్నాయని నివేదిక తెలిపింది. స్థానిక భాషా ప్రావీణ్యం, ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలుండే అభ్యర్థులు ఇప్పుడు 2.5రెట్లు ఎక్కువగా ఉద్యోగాలు పొందే అవకాశం ఉందని, 10 నుంచి 15శాతం అధిక వేతనం కూడా లభిస్తుందని నివేదిక పేర్కొంది.
ఈ ఏడాది సంప్రదాయ బీఎఫ్ఎస్ఐ నియామకాల్లో సేల్స్, రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్‌లు, డిజిటల్ ప్రోడక్ట్ మేనేజర్లు, క్రెడిట్ రిస్క్ అనలిస్టులను బ్యాంకులు ఎక్కువగా నియమించుకుంటున్నాయని నివేదిక పేర్కొంది. వెల్త్ బీమా (సపద బీమా) సంస్థలు ఆర్థిక ప్రణాళికదార్లు (ఫైనాన్షియల్ ప్లానర్లు), పెట్టుబడి సలహాదారులు, డిజిటల్ అండర్ రైటర్లు, క్లెయిమ్ ఆటోమేషన్ నిపుణుల కోసం ఎక్కువగా చూస్తున్నారట.
అయితే, ఇండోర్, కోయంబత్తూర్, నాగ్ పూర్, గువాటి వంటి మార్కెట్లలో నియామకాలు 15శాతం నుంచి 18శాతం పెరిగాయని, సూరత్, జైపుర్, లఖ్ నవూ, భువనేశ్వర్ వంటి ప్రాంతాల్లో 11 శాతం నుంచి 13శాతం పెరుగుదల ఉందని నివేదిక పేర్కొంది.
మరోవైపు.. దేశీయ బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్ఎస్ఐ)కి సంబంధించిన గ్లోబల్ కేపబిలిటీ కేంద్రాలు వేగంగా విస్తరిస్తున్నాయని క్వెస్ కార్ప్ రూపొందించిన బీఎఫ్ఎస్ఐ జీసీసీ టాలెంట్ రిపోర్ట్ 2025 (BFSI GCC Talent Report) తెలిపింది.
అయితే, ఈ రంగంలో ప్రతిభావంతుల కొరత ఉండటం, నైపుణ్య అంతరాలతో సంస్థలకు నియామక వ్యయాలు పెరుగుతున్నాయని తాజా నివేదిక పేర్కొంది. ప్రస్తుతం సుమారు 190 బీఎఫ్ఎస్ఐ గ్లోబల్ కేపబిలిటీ కేంద్రాలకు భారత దేశం నిలయంగా ఉంది. 5,40,000 మంది నిపుణులను ఈ రంగంలోని గ్లోబల్ కేపబిలిటీ కేంద్రాల నియామకాల్లో ఇది నాలుగో వంతని నివేదిక పేర్కొంది.