Four day work week : ఇకనుంచి వారంలో నాలుగు రోజులే పనిదినాలు.. ఈ రంగాల్లో అమలుకు కేంద్రం నిర్ణయం?

Four Day Work Week : జీతాల విషయంలో కూడా పెద్ద మార్పులు ఉండనున్నాయి. ఉద్యోగి మొత్తం సాలరీలో కనీసం 50 శాతం బేసిక్ పే ఉండాలని కొత్త కోడ్స్‌లో ప్రతిపాదించారు. ప్రస్తుతం చాలా కంపెనీలు అలవెన్సుల రూపంలో ఎక్కువ మొత్తాన్ని చెల్లిస్తుండగా, కొత్త నిబంధనలతో బేసిక్ పే పెరగనుంది.

Four Day Work Week

  • వారంలో నాలుగు రోజులు పనిదినాలు
  • కొన్ని రంగాల్లో అమలుకు మార్గం సుగమం
  • ఎంపిక చేసిన రంగాలలో అనుమతికి కేంద్రం ఆమోదం

Four day work week : కేంద్ర ప్రభుత్వం ఈనెల 8వ తేదీన నాలుగు కార్మిక కోడ్‌ల కింద తుది నిబంధనలను నోటిఫై చేసింది. దీంతో పారిశ్రామిక సంబంధాల కోడ్ 2020, వేతనాల కోడ్ 2019, సామాజిక భద్రతా కోడ్ 2020, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల నియమావళి 2020లకు సంబంధించిన నిబంధనల రూపకల్పన పూర్తయింది. పార్లమెంటు చట్టాన్ని ఆమోదించిన దాదాపు ఆరేళ్ల తరువాత జారీ చేసిన 30కిపైగా గెజిట్ నోటిఫికేషన్ల ద్వారా తుది నిబంధనలను నోటిఫై చేసింది.

Also Read : AP Weather : ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. వారం రోజులు జాగ్రత్త.. ఈ జిల్లాల్లో పిడుగులతో వర్షాలు.. మిగిలిన జిల్లాల్లో ..

నాలుగు కార్మిక చట్టాల కింద ప్రభుత్వం నోటిఫై చేసిన నిబంధనలు కొన్ని రంగాల్లో వారానికి నాలుగు రోజుల పనిదినాలకు సంబంధించి మార్గం సుగమం చేయొచ్చునని భావిస్తున్నారు. వారంలో పని గంటలను 48గంటలకు పరిమితం చేస్తూనే యజమానులు, కార్మికులకు రోజువారీ పనిలో వెసులుబాటు కల్పిస్తాయి. రోజువారీ వేతనం కాకుండా, ఇతర వేతనాలు పొందే ఉద్యోగికి సాధారణ పనిదినంగా పరిగణించబడే పని గంటల సంఖ్యను మొత్తం వారపు పని గంటలు 48గంటలకు మించకుండా నిర్దారించాలని వేతనాల కోడ్ నిబంధనలు చెబుతున్నాయి.

దీనివల్ల యాజమానులు ఓవర్‌టైమ్ వేతనాలు వర్తించకుండా, రోజువారీ పని గంటలను 12 గంటల వరకు పెంచుకోవచ్చు. అలాగే, ఉద్యోగులు వారానికి మూడు రోజుల వరకు విశ్రాంతి పొందేందుకు కూడా ఇది వీలు కల్పించవచ్చు. అయితే, రోజువారీ వేతన కార్మికులకు సాధారణ పని దినంలోని గంటల సంఖ్య ఎనిమిది గంటలుగానే ఉంటుంది. ఆ తరువాత ఓవర్ టైమ్ రేట్లు వర్తిస్తాయి.

వృత్తిపరమైన భద్రత, ఆరోగ్య, పని పరిస్థితుల (ఓఎస్ హెచ్ డబ్ల్యూసీ) నిబంధనల ప్రకారం.. సాధారణ పని గంటలు వారానికి 48గంటలుగా నిర్దేశించినందున యాజమానులకు ఈ గంటలను తక్కువ రోజులకు సర్దుబాటు చేసుకునే వెసులుబాటు ఉంది. దీనివల్ల మొత్తం వారపు పరిమితిని మించకుండా నాలుగు రోజుల పనివారాన్ని అమలు చేయడం సాధ్యమవుతుంది.

మౌలిక సదుపాయాలు, కొన్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ, ఐటీ ఆధారిత సేవలు, షేర్డ్ సర్వీసెస్ కార్యకలాపాలు) వంటి షిప్ట్ ఆధారిత, ప్రాజెక్టు ఆధారిత రంగాలకు ఇది ఉపయోగపడవచ్చునని నిపుణులు చెబుతున్నారు. అయితే, క్లయింట్ నిర్దేశించిన కాల పరిమితులు, రియల్ టైమ్ డెలివరీ ఉండే రంగాల్లో దీనిని అమలు చేయడం కష్టంగా ఉండొచ్చు.

జీతాల విషయంలో కూడా పెద్ద మార్పులు ఉండనున్నాయి. ఉద్యోగి మొత్తం సాలరీలో కనీసం 50 శాతం బేసిక్ పే ఉండాలని కొత్త కోడ్స్‌లో ప్రతిపాదించారు. ప్రస్తుతం చాలా కంపెనీలు అలవెన్సుల రూపంలో ఎక్కువ మొత్తాన్ని చెల్లిస్తుండగా, కొత్త నిబంధనలతో బేసిక్ పే పెరగనుంది. దీంతో ఉద్యోగుల పీఎఫ్ మరియు గ్రాట్యుటీ కాంట్రిబ్యూషన్లు కూడా పెరుగుతాయి. అయితే దీనివల్ల ఉద్యోగుల చేతికి వచ్చే ఇన్-హ్యాండ్ సాలరీ కొంత తగ్గే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.

కొత్త కోడ్స్ అమలుతో ఉద్యోగుల హక్కులు రక్షితమవుతాయని, పని వాతావరణం మరింత పారదర్శకంగా మారుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే, చేతికి వచ్చే జీతం తగ్గే అవకాశం ఉండటంపై కొంతమంది ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కోడ్స్ అమలుపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.