floor test పుదుచ్చేరిలోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెల 22న అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాలని లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గురువారం ఆదేశించారు. సీఎం నారాయణ స్వామి ఈ నెల 22న సాయంత్రం 5 గంటలకు అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్ కోరారు. కాగా, తెలంగాణ గవర్నర్‌గా ఉన్న తమిళిసై గురువారం కిరణ్ భేడి స్థానంలో పుదుచ్చేరి ఎల్జీగా అదనపు బాధ్యతలను స్వీకరించిన విషయం తెలిసిందే.
మరోవైపు, ప్రభుత్వం మైనార్టీలో పడిందన్న ప్రతిపక్షాల ఆరోపణలను సీఎం నారాయణ స్వామి ఖండించారు. తమకు తగిన సంఖ్యాబలం ఉన్నదని తెలిపారు. పుదుచ్చేరి అసెంబ్లీలో మొత్తం 30 స్థానాలుండగా కాంగ్రెస్‌కు 15 మంది సభ్యులున్నారు. ముగ్గురు డీఎంకే, ఒక ఇండిపెండెంట్ సభ్యుడి మద్దతుతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
అయితే ఇటీవల కాంగ్రెస్ పార్టీకి నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. దీంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష సభ్యుల సంఖ్య 14కు సమానమైంది. ప్రస్తుతం మెజార్టీ మార్క్ 15 కాగా, అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన సంఖ్యాబలం లేదని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ నేపథ్యంలో బలపరీక్షకు డిమాండ్ చేయగా ఎల్జీ తమిళిసై దీనికి సమ్మతించారు.