Toll Tax
Tamilnadu: తమిళనాడు రాష్ట్రంలోని 14 ప్రధాన టోల్‌ప్లాజాల్లో చార్జీలు పెరగనున్నట్లు జాతీయ రహదారుల శాఖ అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలో పశ్చిమ, దక్షిణ జిల్లాలకు వెళ్లే రహదారుల్లో ఉన్న 14 ప్రధాన టోల్‌ప్లాజాల్లో 2021 సెప్టెంబరు 1వ తేది నుంచి 8 శాతం వరకు సుంకం పెరగనుంది.
సంవత్సరానికి ఒకసారి వాహనాల నుంచి వసూలుచేసే సుంకం పెంచడం ఆనవాయితీగా వస్తుండగా.. విల్లుపురం జిల్లా దిండివనం-ఉళుందూర్‌పేట మార్గంలో ఉన్న విక్కిరవాండి, ఉళుందూర్‌పేట-పాడలూరు రహదారిలో ఉన్న తిరుమందురై, చెన్నై నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్లే తడ మార్గంలో ఉన్న నల్లూరు, సేలం-ఉళుందూర్‌పేట రహదారిలో ఉన్న మేటుపట్టి, సేలం-కుమారపాళయం రహదారిలో ఉన్న వైకుంఠం, తిరుచ్చి-దిండుగల్ మార్గంలో ఉన్న పొన్నంబళంపట్టి, తంజావూరు-తిరుచ్చి జాతీయ రహదారిలో ఉన్న పాలవందాన్‌కోట సహా 14 టోల్‌ప్లాజాలలో వచ్చే సెప్టెంబరు 1వ తేదీ నుంచి పెరిగిన సుంకం అమల్లోకి రానుంది.
అయితే, ఇదే విషయంపై తమిళనాడు ఇసుక లారీ యజమానుల సంక్షేమ సంఘాల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఏళ్ల తరబడి టోల్ సుంకం పెంచడం వల్ల నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో పాటు వాహనచోదకులు, వాహన యజమానులు ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నట్లు అభిప్రాయపడింది.
ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న టోల్‌ప్లాజాలు మూసివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. టోల్‌ప్లాజా నిర్వహణ బాధ్యతలు తమిళులకు అప్పగించాలని, టోల్ సుంకం పెంచే నిర్ణయాన్ని ఉపసంహరించుకుని కరోనా సంక్షోమ సమయంలో అండగా ఉండాలని కోరుతున్నారు.