ఢిల్లీలో రెండు రోజులు నైట్ కర్ఫ్యూ, నూతన సంవత్సర వేడుకలు లేవు

Night Curfew In Delhi Today, Tomorrow : కరోనా వైరస్ కేసులు తగ్గకపోవడం, కొత్త రకం కరోనా స్ట్రెయిన్ కలవర పెడుతోంది. భారతదేశంలో కేసులు నమోదవుతుండడంతో పలు రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. ఈ క్రమంలోనే..నూతన సంవత్సరం ప్రారంభం కాబోతోంది. దీంతో ఎలాంటి వేడుకలు నిర్వహించరాదని ఆప్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 31, జనవరి 01వ తేదీల్లో ఢిల్లీ రాష్ట్ర వ్యాప్తంగా.. రాత్రి వేళ కర్ఫ్యూ విధిస్తున్నట్లు వెల్లడించింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 06 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని, ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమి కూడరాదని ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఈ మేరకు ఢిల్లీ చీఫ్ సెక్రటరీ విజయ్ దేవ్ ఉత్తర్వులు జారీ చేశారు.

కర్ఫ్యూ ఉన్నా..అంతర్ రాష్ట్ర ప్రయాణాలు, రవాణాపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని పోలీసులు వెల్లడిస్తున్నారు. ఇండియా గేట్, రాజ్ పథ్, విజయ్ చౌక్, పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో సాధారణ ప్రజలకు రాత్రి 8 గంటల తర్వాత నో ఎంట్రీ అని వెల్లడించారు అధికారులు. నూతన సంవత్సర వేడుకలు నిర్వహించడం వల్ల కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని DDMA వెల్లడించింది. కరోనా వైరస్ ను ఎదుర్కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న సీఎం కేజ్రీవాల్..ప్రతి రోజు 8 వేల 500 కరోనా కేసులు వెలుగు చూశాయని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రజలు కరోనాను జయించారని తెలిపారు.

యుకేలో కొత్తరకం వైరస్ ను గుర్తించిన సంగతి తెలిసిందే. VUI – 2020, 12/11 అని పిలుస్తున్నారు. లండన్, సౌత్ఈస్ట్ ఇంగ్లాండ్ లలో శరవేగంగా ఈ వైరస్ వ్యాపిస్తోంది. దీంతో ఇంగ్లాండ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. క్రిస్మస్ కు నాలుగు రోజుల ముందే..కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. పలు దేశాలు ఆంక్షలు, నిబంధనలు విధిస్తున్నాయి.